
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సోదరిగా అందరికీ సుపరిచితమైన ఆమె.. తాజాగా తన జీవితంలోని అత్యంత భయంకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో పొద్దున్నుంచి రాత్రి వరకు మద్యం తాగడమే పనిగా పెట్టుకున్నానని, అసలు తనేం చేస్తున్నానో కూడా తెలిసేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాక ఆమె ఎలా మేల్కొన్నారు? ఆ వ్యసనాన్ని ఎలా జయించారు?
హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. మద్యపానం అనే వ్యసనం నుంచి తను ఎలా బయటపడిందనే విషయాలను ఆమె అందులో వివరించారు. “మనలో ఒక చెడు అలవాటు ఉందని అంగీకరించడమే అన్నిటికంటే పెద్ద విషయం. ఒక్కసారి మనం తప్పు చేస్తున్నామని గుర్తిస్తేనే మార్పు మొదలవుతుంది. నేను ఒకానొక సమయంలో తాగుడుకు పూర్తిగా బానిసయ్యాను. తిండి, మద్యం.. ఇలా ప్రతిదీ వ్యసనంగా మారి అందులో మునిగిపోయాను. నాకేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాను” అని సునయన చెప్పుకొచ్చారు.
గతంలోనూ సునయన తన తాగుడు అలవాటు గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. మొదట్లో సరదాగా ప్రారంభమైన ఈ అలవాటు, తర్వాత తీవ్రంగా మారిందని తెలిపారు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మద్యం సేవించడమే అలవాటుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మితిమీరిన మద్యపానం వల్ల తాను ఏం చేస్తున్నానో, ఎక్కడ ఉన్నానో కూడా మర్చిపోయే స్థితికి చేరుకున్నట్లు వెల్లడించారు. మద్యం మాత్రమే కాకుండా స్వీట్లు, జంక్ ఫుడ్ కూడా అతిగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడుచేసుకున్నానని ఆమె తెలిపారు.
ఈ వ్యసనాల నుంచి బయటకు రావడం అంత సులభం కాదని సునయన అన్నారు. “దృఢ సంకల్పం, మన చుట్టూ ఉండేవారి సపోర్ట్ ఉంటేనే ఏ వ్యసనం నుంచైనా బయటపడగలం. నేను కూడా డీ-అడిక్షన్ సెంటర్‌కు వెళ్లాను. అక్కడి చికిత్స, నా కుటుంబ సభ్యుల సహకారంతో చివరకు ఈ వ్యసనంపై విజయం సాధించాను. భయపడకుండా ముందడుగు వేయండి, మీ సమస్యల గురించి ఓపెన్‌గా మాట్లాడండి” అని ఆమె పిలుపునిచ్చారు. ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే ఏదైనా జయించవచ్చని ఆమె తన వీడియో ద్వారా భరోసా ఇచ్చారు.
సునయన రోషన్ చేసిన ఈ పోస్ట్‌కు ఆమె సోదరుడు హృతిక్ రోషన్ స్పందిస్తూ “లవ్యూ దీదీ” అని ప్రేమగా కామెంట్ చేశారు. ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ స్పందిస్తూ.. “నువ్వు ఒక ఇన్ స్పిరేషన్” అంటూ తన కూతురి ధైర్యాన్ని అభినందించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే సునయనను ఆ చీకటి నుంచి బయటకు తీసుకువచ్చిందని ఈ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని ఆనందంగా గడుపుతున్నారు. సునయన రోషన్ కథ కేవలం ఒక సెలబ్రిటీ కథ మాత్రమే కాదు.. వ్యసనాలతో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప పాఠం. సంకల్పం ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చని ఆమె నిరూపించారు.