Zakir Hussain : ప్రముఖ సంగీత దర్శకుడు, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ పుట్టిన రోజు నేడు
ప్రముఖ భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు జాకిర్ హుస్సేన్ పుట్టిన రోజు నేడు.. తన సంగీతంతో దేశ విదేశాల్లో ఖ్యాతి గాంచిన జాకిర్ హుస్సేన్ మార్చి 9, 1951 న జన్మించారు. ఆయన తండ్రి అల్లా రఖా కూడా...
Zakir Hussain : ప్రముఖ భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు జాకిర్ హుస్సేన్ పుట్టిన రోజు నేడు.. తన సంగీతంతో దేశ విదేశాల్లో ఖ్యాతి గాంచిన జాకిర్ హుస్సేన్ మార్చి 9, 1951 న జన్మించారు. ఆయన తండ్రి అల్లా రఖా కూడా ప్రఖ్యాత తబలా విద్వాంసుడే. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జాకీర్ హుస్సేన్ ఒక బాలమేధావి. 3 ఏళ్ల వయసు నుంచే తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. పక్వాజ్ అనే సంగీత వాయిద్యాన్ని నేర్చుకున్నారు.
ముంబై లోని సెయింట్ మైకేల్ హైస్కూల్లో పదవ తరగతి.. తరువాత సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు జాకిర్. ఇక తన 11 వ ఏట నుంచే దేశ విదేశాలను పర్యటిస్తూ.. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇక ఉన్నత విద్య కోసం 1969 లో అమెరికా కు పయనమయ్యారు. అక్కడ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో సంగీతంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన దాదాపు విదేశాల్లో ఏడాదికి 150 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. జాకిర్ హుస్సేన్ మొదటి ఆల్బం 1991 లో విడుదలైంది. 1992 లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బం గా గ్రామీ అవార్డు అందుకుంది. వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఈ అవార్డును ఆ ఏడాదే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేశారు.
జాకిర్ హుస్సేన్ సంగీతానికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అనేక అవార్డులను ఇచ్చి సత్కరించింది. 1988లో పద్మశ్రీ పురస్కారాన్నీ, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ అందజేసింది. ఇక 1990 లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడెమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అంతేకాదు 1999 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆయనకు ఆ దేశంలో సాంప్రదాయ కళాకారులకు, సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది.
ఇక జాకిర్ హుస్సేన్ కథక్ నృత్యకారుణి మిన్నేకోలాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు.. ప్రస్తుతం ఆయన శాన్ ఫ్రాన్సిస్కో లో నివాసంఉంటున్నారు. చాలా మంది తెలుగువారికి వాహ్ తాజ్ అనండి అంటూ తాజ్ మహల్ టి యాడ్ తో సుపరిచితులు జాకిర్ హుస్సేన్.. సంగీత విద్వాంసునకు పుట్టిన రోజు శుభాకాంక్షలను సెలబ్రెటీలనుంచి సామాన్యుల వరకూ చెబుతున్నారు.
Also Read: