Gargi Movie Review: సమస్యల లోతులను స్పృశించి, ఆలోచింపజేసే ‘గార్గి’

| Edited By: Janardhan Veluru

Jul 15, 2022 | 1:00 PM

Sai Pallavi's Gargi Movie Review: ఆల్రెడీ ఆమె యాక్ట్ చేసిన విరాటపర్వం ఇంకా జనాల మనసుల నుంచి వెళ్లనేలేదు. అప్పుడే గార్గి అనే మరో సినిమాతో ప్రేక్షకుల మనసులను తడుతున్నారు సాయి పల్లవి.

Gargi Movie Review: సమస్యల లోతులను స్పృశించి, ఆలోచింపజేసే గార్గి
Gargi Movie
Follow us on

Sai Pallavi’s Gargi Movie Review: ట్రైలర్‌లో సింపుల్‌ కాటన్‌ చీరలో సాయిపల్లవి కనిపించారంటే సినిమాలో కీలకమైన విషయాన్ని చర్చిస్తున్నారనే మాట ఆటోమేటిగ్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఆమె యాక్ట్ చేసిన విరాటపర్వం ఇంకా జనాల మనసుల నుంచి వెళ్లనేలేదు. అప్పుడే గార్గి అనే మరో సినిమాతో ప్రేక్షకుల మనసులను తడుతున్నారు సాయి పల్లవి. తమిళనాడులో సూర్య, జ్యోతిక సమర్పించిన గార్గి మూవీని, తెలుగులో రానా సమర్పించడంతో సినిమాకు మరింత హైప్‌ వచ్చింది. మరి కథలో అంతే విషయం ఉందా? చదివేయండి.

సినిమా: గార్గి

నటీనటులు: సాయి పల్లవి, కాళి వెంకట్‌, ఐశ్వర్య లక్ష్మి, ఆర్‌.ఎస్‌.శివాజీ, కలైమామణి శరవణన్‌, జయప్రకాష్‌, ప్రతాప్‌, సుధ, లివింగ్‌స్టన్‌ తదితరులు

ఇవి కూడా చదవండి

సమర్పణ: రానా దగ్గుబాటి

సంస్థలు: బ్లాకీ, సీనీ అండ్‌ మై లెఫ్ట్ ఫుట్‌ ప్రొడక్షన్

నిర్మాతలు: రవిచంద్రన్‌ రామచంద్రన్‌, థామస్‌ జార్జి, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్‌ రామచంద్రన్‌

దర్శకత్వం: గౌతమ్‌ రామచంద్రన్‌

సంగీతం: గోవింద్‌ వసంత

ఎడిటర్‌: షఫీ మహమ్మద్‌ అలీ

మాటలు-పాటలు: రాకేందుమౌళి

విడుదల: 15.07.2022

గార్గి స్కూలు టీచర్‌. తల్లి, చెల్లి, తండ్రి అని చిన్న కుటుంబం. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చి సెటిలైన ఫ్యామిలీ. ఇంటిపెద్ద అదే ఏరియాలో ఉన్న పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలో వాచ్‌మేన్‌గా పనిచేస్తుంటాడు. ఆ గేటెడ్‌ కమ్యూనిటీలో ఓ తొమ్మిదేళ్ల పాప మీద అఘాయిత్యం జరుగుతుంది. అక్కడ పని చేసుకోవడానికి వచ్చిన నలుగురు యువకులతో పాటు గార్గి తండ్రిని కూడా అరెస్ట్ చేస్తారు పోలీసులు. అప్పటికే షుగరున్న 60 ఏళ్ల తండ్రి ఈ కేసులో ఉండటం చాలా మందిని విస్మయానికి గురి చేస్తుంది. తన తండ్రి ఇలాంటి వాడని నమ్మదు గార్గి. అందుకే ఎలాగైనా అతన్ని కాపాడుకోవాలని అనుకుంటుంది. ఆమె ఎంత గట్టిగా సంకల్పించుకుంటుందో, పరిస్థితులన్నీ ఆమెకు అంతే గట్టిగా ఎదురుతిరుగుతాయి.

చిన్న పాపకు సంబంధించిన కేసు కావడంతో నిందితుడి తరఫున వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రారు. కానీ తనకంటూ ఎవరూ లేని ఓ లాయరు మాత్రం… గార్గి పరిస్థితిని చూసి కరిగి, సాయం చేయడానికి ఆమె తండ్రి తరఫున పోరాడటానికి సిద్ధమవుతాడు. ఈ కేసును డీల్‌ చేయడానికి జడ్జిగా ట్రాన్స్ జెండర్‌ని అపాయింట్‌ చేస్తుంది కోర్టు.  అనుభవమే లేని లాయర్‌, పైగా నత్తి ఉన్న వ్యక్తి ఈ కేసును ఎలా డీల్‌ చేశాడు? ఏం చెప్పి ఒప్పించి గార్గి తండ్రిని బయటకు తీసుకొచ్చాడు? బాధితురాలి కుటుంబం మానసిక పరిస్థితి ఏంటి? నిందితుడిగా వార్తలకెక్కిన వ్యక్తి కుటుంబం పరిస్థితి ఏంటి? అప్పటికే నిశ్చితార్థమైన గార్గి పెళ్లి సంగతేంటి? వంటివన్నీ సినిమాను నడిపిన అంశాలు.

పసి పిల్లల మీద, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు వాటిని చూడటానికి కూడా మనసు ఒప్పదు. అలాంటిది పసి మొగ్గల మీద అత్యాచారం చేయడానికి మనసెలా వస్తుంది? అలాంటి సిట్చువేషన్స్ లో మీడియా ఎలా ప్రవర్తిస్తుంది? మాస్ మేనియా ఎలా ఉంటుంది? మహిళా సంఘాలు ఏమంటాయి? జనాలకోసం పోరాడాల్సిన న్యాయవాదులు ఏం చేస్తారు? న్యాయస్థానాలు ఎలా సంయమనం పాటిస్తాయి? వంటి చాలా విషయాలను స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.

Sai Pallavi in Gargi Movie

గార్గి కేరక్టర్‌లో సాయిపల్లవి, ఆమె తండ్రి బ్రహ్మానందంగా ఆర్‌.ఎస్‌.శివాజీ, గార్గికి సపోర్ట్ చేసే న్యాయవాదిగా కాళీ వెంకట్‌ నటన సినిమాకు హైలైట్‌.  రేపు బావుంటుంది, ఈరోజు గడిస్తే తెల్లారిన తర్వాత అంతా బావుంటుందనుకునే మిడిల్‌ క్లాస్‌ మహిళల మెంటాలిటీని గార్గి తల్లి పాత్రలో చూపించారు. బాధితురాలి తండ్రి గోడును చూపించిన సందర్భంలో ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. అలాగే, నిజం కోసం గార్గి పోరాడిన తీరు కూడా మెప్పిస్తుంది. ప్రతి మైన్యూట్ డీటైల్‌ని చూపించే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. సాయిపల్లవికి ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. లొకేషన్స్ కూడా నేచురల్‌గా ఉన్నాయి. అమ్మాయిలకు ఉన్న నొప్పి తెలుసు, అబ్బాయిలకు ఉన్న పొగరూ మాకు తెలుసు… ఇలాంటి కేసులు డీల్‌ చేయడానికి మేమే కరెక్ట్ అంటూ ట్రాన్స్ జెండర్‌ జడ్జి చెప్పే మాటలు క్లాప్స్ కొట్టిస్తాయి. రాకేందుమౌళి డైలాగులు చాలా సందర్భాల్లో మనసును తాకుతాయి.

మరీ సీరియస్‌గా సాగే కథలో కోర్టు రూమ్‌ సీన్స్ కాస్త రిలీఫ్‌ ఇస్తాయి. కథని ముందుకు తీసుకెళ్తూనే, ఆడియన్స్ ని ఎమోషనల్‌గా బ్యాలన్స్ చేస్తాయి. హోమ్‌ ట్యూషన్లకు వచ్చే మాస్టార్లను నమ్మవచ్చా? నమ్మకూడదా? వయసైపోయిన వాళ్ల దగ్గరకైనా పిల్లలను ధైర్యంగా పంపలేమా? మన ఇంటిని కాపాలా కాసే వాచ్‌మెన్‌, ఇంట్లో పిల్లలకు హాని చేస్తాడా? ఎవరిలో ఏ ముఖం దాగి ఉందో… నలుగురితో బావుంటూనే, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని గట్టిగా చెప్పిన సినిమా గార్గి.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని సినిమా రివ్యూస్ చదవండి..