
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. లవర్స్ డే సందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచిన వర్మ.. తాజాగా చిత్రం తొలి సాంగ్ వీడియో విడుదల చేశారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో ఉన్న పాటను వర్మ ఈరోజు రిలీజ్ చేశారు. నీ ఉనికి అంటూ సాగే పాటని బాలసుబ్రహ్మణ్యం పాడగా.. సిరాశ్రీ లిరిక్స్ అందించారు. కళ్యాణ్ మాలిక్ సంగీతమందించారు. ఈ వీడియోలో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంట్లోకి అడుగుపెట్టడం ఆ తర్వాత ఆయన జీవితంలోకి రావడం వంటి సన్నివేశాలని చూపించారు. చిత్రంలో యజ్ఞాశెట్టి లక్ష్మీపార్వతి పాత్రలో నటిస్తోండగా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.