దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు దిశకు న్యాయం జరిగింది అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించింది. నిందితులను ఎన్‌కౌంటర్ చేసినందుకు గానూ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే.. పవన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది పూనమ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన పూనమ్.. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ లోపే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
కాగా ఆ ట్వీట్‌లో ‘‘ఈ ఉదయం మంచి వార్తను విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో పవన్ కల్యాణ్ పేరును ప్రత్యక్షంగా వాడనప్పటికీ.. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటలను కామెంట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ పవన్‌కేనని అందరినీ అర్థమైంది. కానీ బాధితురాలు పేరును వాడినందుకో లేక మరో కారణమో తెలీదు కాసేపటికే ఈ ట్వీట్‌ను పూనమ్ డిలీట్ చేసింది. అయితే ఇటీవల రేపిస్ట్‌ల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. నిందితులకు రెండు బెత్తం దెబ్బలు తగిలించాలి అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
అంతేకాదు ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ‘‘దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు థ్యాంక్స్. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నా. అలాగే ఇలాంటి కేసుల్లో దోషులకు క్షమాభిక్ష అవసరం లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించడం చాలా ఆనందంగా ఉంది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే పవన్ కల్యాణ్‌కు పూనమ్ చురకలంటించడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కామెంట్లు చేసింది. దీనిపై పవన్ అభిమానులు కూడా ఆమెను పలుమార్లు ట్రోల్ చేశారు.