
టాలీవుడ్‌లో ఫ్యాన్ వార్స్ కొత్తేం కాదు. ఒక స్టార్ హీరో సినిమా విడుదలైనప్పుడు మరొక హీరో ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం, నెగెటివ్ రివ్యూస్ ఇస్తూ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడటం చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ ఫ్యాన్స్ వరకేగానీ మేమంతా మంచి స్నేహితులం అంటూ స్టార్ హీరోలందరూ పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. కానీ డైరెక్టర్ మారుతి ఒక్క కామెంట్‌తో ఇద్దరు టాప్ స్టార్స్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య భారీ యుద్ధానికి తెరతీశారు. అసలు మారుతి ఏమన్నారు? ఎందుకు క్షమాపణ చెప్పారు?
‘ది రాజా సాబ్’ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ లాంచ్ ఈవెంట్‌లో మారుతి మాటలు వివాదానికి దారితీశాయి. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియా హల్‌చల్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారుతిపై మండిపడుతున్నారు. ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్‌ను పొగుడుతూ మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేశాయి. రొమాంటిక్ హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మారుతి స్పీచ్‌లో ప్రభాస్ పట్ల అభిమానం బాంబులా బాస్ట్ అయింది.
‘నేను రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. ప్రభాస్ నా టాలెంట్‌ను గుర్తించి యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నాడు. ప్రభాస్ ఫోటో జేబులో పెట్టుకునే ఎవరైనా టాప్ డైరెక్టర్ అవుతాడు’ అంటూ ప్రభాస్‌ను హైలైట్ చేశారు. ఆ తర్వాత ‘రేపు పండక్కి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు అని నేను చెప్పను… ఎందుకంటే ప్రభాస్ కటౌట్‌కి అవి చాలా చిన్న మాటలు’ అన్నారు మారుతి. ఈ మాటలు ప్రభాస్ ఫ్యాన్స్‌కి జాయ్ ఇచ్చాయి వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇది రెడ్ ఫ్లాగ్లా పని చేసింది! ఇప్పుడు మారుతి క్షమాపణ చెప్పినా, వివాదం ఆగడం లేదు.
ఎందుకంటే ‘కాలర్ ఎగరేయడం’ అంటే టాలీవుడ్‌లో ఎన్టీఆర్ సంబంధిత ఐకానిక్ గెస్చర్. ‘దేవర’ ప్రమోషన్స్, ‘వార్ 2’ ఈవెంట్స్‌లో ఎన్టీఆర్ కాలర్‌ను ఎత్తి ఎగరేసి మాట్లాడారు. దీన్ని ప్రభాస్ కటౌట్‌తో కంపేర్ చేయడం ‘చిన్న మాటలు’ అని చెప్పడం ఎన్టీఆర్ లెగసీకి అగౌరవంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ‘ఒక హీరోని ఎత్తిచూపడానికి ఇంకొక హీరోను తగ్గించే హక్కు ఎవరికీ లేదు!’ అని ఒకరు, ‘పెద్ద హీరోతో సినిమా కుదిరింది కాబట్టి ఇంత అహంకారం వచ్చిందా?’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘మారుతి మాటలు ప్రభాస్ మ్యాజిక్ గురించి మాత్రమే!’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాంటర్ ఇచ్చారు. ఈ వాదన ఫ్యాన్స్ వార్కి దారితీసింది.
మారుతి త్వరగా రియాక్ట్ అవుతూ తన X (ట్విట్టర్)లో పోస్ట్ చేసి క్షమాపణ చెప్పారు. ‘నేను నా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ముందుగా ప్రతి అభిమానికీ హృదయపూర్వక క్షమాపణలు. ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. స్టేజ్‌పై మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా మాటలు బయటకు రావు. నేను మాట్లాడినది తప్పుగా అర్థం చేసుకున్నందుకు చింతిస్తున్నాను. నాకు ఎన్టీఆర్ గారి పట్ల, ఆయన అభిమానుల పట్ల అపారమైన గౌరవం ఉంది. నేను ఆయనను ఉద్దేశించి ఈ మాటలు చెప్పలేదు’ అంటూ ఆయన మాటలు ప్రభాస్ కటౌట్ గొప్పతనాన్ని చూపించడానికి మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇకనైనా ఈ వివాదం ముగిసిపోతుందో చూడాలి మరి!