ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒకప్పుడు సినితారల గురించి పెద్దగా తెలిసిదే కాదు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సినీ తారలకు సంబంధించిన అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. వెకేషన్ మొదలు, తమ వ్యక్తిగత వివరాలను సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. దీంతో సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది.
అయితే ఇదే సమయంలో కొందరు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సెలబ్రిటీలపై ట్రోలింగ్‌కు ఇదే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. సినీ తారల వ్యక్తిగత వివరాలపై ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి ట్రోలింగ్స్‌పై కొందరు చూసి చూడనట్లు ఉంటే మరికొందరు గట్టిగానే బదులిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ తనపై వచ్చిన ట్రోలింగ్స్‌కు సంబంధించి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దిల్‌రాజు గత కొన్నేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
దీంతో తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గతంలో తనపై జరిగిన ట్రోలింగ్‌పై స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘నా పెళ్లి తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నా భార్యను ఎలా కలిశాను లాంటి వివరాలను తెలిపాను. ఆ వీడియోపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ విషయాన్ని నా భార్య నాకు తెలిపింది. అయితే నేను అలాంటి విషయాలను అస్సలు పట్టించుకోను. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ చేసేవాళ్లు పదివేల మంది మాత్రమే ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.
ఇలా ట్రోలింగ్ చేసే వారిని పట్టించుకుంటే.. మిగతా వాళ్లకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందన్న దిల్‌రాజు, అందుకే తాను అలాంటి వాళ్ల గురించి ఆలోచించనని చెప్పుకొచ్చారు. నెగిటివిటీని మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలన్నారు. అవన్నీ వచ్చి, పోయే మేఘాలాంటివనీ, తాను మాత్రం ఆకాశంలాంటివాడినని చెప్పుకొచ్చారు.’ ట్రోలింగ్స్ ఏమైనా మనల్ని చంపేస్తాయా.. చంపవు కదా.! అలాంటి అలాంటి మేఘాలన్నీ వెళ్లిపోయాక మనకు ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..