ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్ లోని తన నివాసంలోని స్టోర్ రూమ్‌లో ఆమె తన స్కార్ఫ్ తో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. గురువారం రాత్రి ముస్కాన్ ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం..ఇటీవలే ముంబై నుంచి యూపీ వెళ్లిన ఆమె గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా భోజనం చేసింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె తల్లి ముస్కాన్ గదిలోకి వెళ్లగా ఆమె కనిపించలేదు. ఇళ్లంతా వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పైనున్న స్టోర్ రూంకు వెళ్లి చూడగా.. ముస్కాన్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే ఆమెను కిందికి దింపి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందు ముస్కాన్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో ఇదే నా లాస్ట్ వీడియో అంటూ ముస్కాన్ చెప్పడం గమనార్హం. ‘ఇదే నా లాస్ట్ వీడియో. ఇకపై నేను మీకు కనిపించను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను. కానీ తిరిగి వాళ్లే నన్ను కన్విన్స్ చేస్తున్నారు. నేను చేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరిని నిందించకండి’ అంటూ చివరికి కామెడీతో ముగించింది.
అయితే ముంబై నుంచి వచ్చిన తర్వాత ముస్కాన్ చాలా బాధగా ఉండేదని.. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తమతో ఎంతో సరదాగా గడిపిందని ముస్కాన్ తండ్రి తెలిపారు. ముస్కాన్ ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన అనంతరం.. ముంబైలోని ఒక కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.