
ఎలాంటి సినీ బ్యాగ్రాండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది కత్రీనా కైఫ్. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. హిందీలో స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో వివాహం జరిగిన తర్వాత సినిమాలు తగ్గించింది. ఇటీవలే మెరీ క్రిస్మస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రీనా తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అవమానాలను గుర్తుచేసుకున్నారు. తనకు డాన్స్ రాదని.. ఎప్పటికీ సక్సెస్ కాలేదని ముఖంపైనే చెప్పేశారని చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో తన డాన్స్ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయని.. కానీ ఆ అవమానాలను పట్టించుకోకుండా నటిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశానని తెలిపింది.
మిడ్ డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ.. “తెలుగులో సౌత్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్న సమయం నాకు ఇంకా గుర్తుంది. ఆ మూవీ సెట్ లో ఎవరో మైక్ లో ఈ అమ్మాయికి డాన్స్ రాదని అన్నారు. ఆ మాటలు విని చాలా బాధపడ్డాను. కానీ అలాంటి విమర్శలను పట్టించుకోవద్దని భావించాను. కేవలం అలాంటి మాటలు నాకు ఒక రకమైన సమాచారం మాత్రమే అని అనుకున్నాను.. చాలా మంది నా ముఖం మీదే ఎన్నో విమర్శలు చేశారు. ఆమె ఎప్పటికీ విజయం సాధించలేదు.. ఎలాంటి పనులు చేయదు.. ఎప్పుడు సినిమాలో తీసుకోవద్దు.. ఆమెతో కలిసి పనిచేయలేము అన్నారు. కానీ.. ఇప్పుడు వారంతా నాతో కలిసి సినిమాలు చేశారు. ప్రతి మాటను నా మనసుకు దగ్గరగా తీసుకోను.. ఎందుకంటే అవి మనల్ని మరింత నిరాశ పరుస్తాయి. ఎప్పటికీ ఆమాటలను ఒక సమాచారంగా మాత్రమే భావిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. కత్రీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
కత్రినా చివరిసారి మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించింది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. అలాగే ఆమె సల్మాన్ జోడీగా టైగర్ 3లో నటించింది. ఇవే కాకుండా ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.