చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్కార్ అవార్డుకు ఎంపికైన ఛెలో షో సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ మృతి చెందారు. 15 ఏళ్ల వయసున్న బాలనటుడు రాహుల్ కోలీ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించి అక్టోబర్ 2న మరణించినట్లు రాహుల్ తండ్రి తెలిపారు. అతను నటించిన ఛెలో షో సినిమా 95వ ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగం భారత్ తరపున ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఈ సినిమాలో నటించిన ఆరుగురు చిన్నారులలో రాహులు ఒకరు. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన సమయ్ ప్రాణ స్నేహితుడిగా కనిపించారు. రాహుల్ మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని మరణంపట్ల సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
మరణించే ముందు రాహులు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడని.. రక్తం వాంతులు చేసుకున్నాడని అతని తండ్రి తెలిపారు. తన కొడుకు నటించిన ఛెలో షో సినిమాను కుటుంబంతో కలిసి చూస్తామని తెలిపారు. ఈ మూవీ అక్టోబర్ 14న విడుదల కానుంది. గుజరాత్ ప్రాంతంలోని ఓ గ్రామంలో చిన్నతనంలోనే సినిమాల పట్ల ఆకర్షితుడైన పాన్ నలిన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొమ్మిదేళ్ల బాలుడు సినిమాల పట్ల ఉన్న ప్రేమతో తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఛెలో షో..
ఈ సినిమా న్యూయార్క్ సెట్ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ 2021 ఎడిషన్ లో ప్రదర్శించారు. అలాగే ఈఏడాది ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అలాగే ఈ మూవీ ఒక్కరోజు ముందు భారతదేశంలోని అన్ని థియేటర్లలో రూ. 95తో వీక్షించవచ్చు అని చిత్రయూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది.