బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రామ్ సేతు చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత నార్త్ ఆడియన్స్ హిందీ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మరోవైపు ఈ సినిమాకు తలనొప్పులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో చరిత్రను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ బీజేపి నేత సుబ్రహ్మణ్యస్వామి చిత్రబృందానికి నోటీసులు పంపారు. ఇక ఇప్పుడు ఓ చరిత్రకారుడు మేకర్స్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా తన పరిశోధనను. జీవిత కథను వాడుకున్నారంటూ.. అక్షయ్ కుమార్ తోపాటు చిత్రయూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని శ్రీలంకలో రామాయణ రీసెర్చ్ కమిటీకి డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తోన్న డాక్టర్ ఆశోక్ కైంత్ ఆరోపించారు.
రామ్ సేతు చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన డాక్టర్ ఆర్యన్ పాత్ర తన జీవిత కథకు ప్రతిరూపమని.. అలాగే మూవీలో క్యారెక్టర్ చేసిన రీసెర్చ్ వర్క్ తన అనుమతి లేకుండా వెబ్ సైట్ నుంచి తీసుకున్నారని అన్నారు. ఇటీవల ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ కైంత్ మాట్లాడుతూ.. శ్రీలంకలో రామాయణ వాస్తవాల ఉనికిని తాను ఎలా పరిశోధించానో.. ఆ పాత్రను తన జీవిత కథను ప్రదర్శిస్తుందని తెలిపారు. కానీ సినిమాలో చేయకూడని విషయాలు కూడా కల్పించి చేశారని… దీనిపై కాపీ రైట్ కేసు వేస్తానని హెచ్చరించారు. సినిమా చేసే ముందు తన పర్మిషన్ తీసుకుని.. తన వద్దకు వచ్చి పూర్తి వివరాలు చర్చించి ఉంటే సినిమా మరింత బాగుండేదని అన్నారు.
ఇక తన జీవిత కథను కాపీ కొట్టిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని.. హోమంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయం.. సమాచార ప్రసారాల శాక మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఒకవేళ ఎవరు తన ఫిర్యాదును పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమన్నారు. రామ్ సేతు చిత్రం చిక్కుల్లో పడడం ఇది మొదటి సారి కాదు. ఈ సినిమాలో అసత్య వాస్తవాలను చిత్రీకరించారని.. చిత్రయూనిట్ కు నోటీసులు పంపారు. అంతేకాకుండా హీరోపై కేసు వేస్తానని హెచ్చరించారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాగానే నెట్టింట దారుణంగా ట్రోల్ చేశారు.
పోస్టర్ లో అక్షయ్ చేతిలో జ్వాల టార్చ్ తో గుహలాంటి ప్రదేశంలో నిలబడి ఉండగా.. అతడి పక్కనే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంది. కానీ ఆమె విద్యుత్ టార్చ్ పట్టుకుని ఉంది. దీంతో వారిద్దరు ఎలక్ర్టిక్ టార్చ్ లు ఎందుకు పట్టుకోలేదంటూ నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇక ఈ మూవీలో అక్షయ్ కుమార్ భారత్, శ్రీలంక మధ్య ఉన్న రామసేతు గురించి నిజం తెలుసుకోవడానికి కృషి చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్త పాత్ర పోషించాడు.