ఒకప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి బాలీవుడ్ సినిమాలు. ఎన్నో సూపర్ హిట్ విజయాలను అందుకున్న బీటౌన్.. గత కొంతకాలంగా సరైన హిట్టు పడలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్న హీరోల మూవీస్ మాత్రమే కాదు.. స్టార్ హీరోస్ చిత్రాలు కూడా కనీసం పాజిటివ్ టాక్ సంపాదించుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం నార్త్‌లో సౌత్ చిత్రాల హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదలైన దక్షిణాది చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి. దక్షిణాది చిత్రాలు ఇప్పుడు బాటీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాయి. అయితే సౌత్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నా(Bollywood vs South Cinema).. హిందీ చిత్రాలు ఎందుకు హిట్ కావడం లేదు అనే ప్రశ్నపై షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.
అనురాగ్ మాట్లాడుతూ.. హిందీ మాట్లాడటం రానివాళ్లు హిందీ సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్స్ రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు చూసినప్పుడు.. వారు వారి సంస్కృతిలో జీవించేస్తారు. వారు తమ సంస్కృతిని.. భాషపై పట్టుతో ఉంటారు. కానీ హిందీ రాకుండా.. కేవలం ఇంగ్లీష్ మాట్లాడం వచ్చిన వాళ్లు ఇక్కడ సినిమాలు తీస్తున్నారు. ఇది కచ్చితంగా సినిమాపై ప్రభావం చూపిస్తుంది. భాష మాట్లాడటం రానివాళ్లు సినిమా తీస్తే అప్పుడు కథ మూలాల్లోకి వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది ?. గంగూబాయి కతియావాడి, భూల్ భూలయ్యా 2 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఎందుకంటే ఈ రెండు చిత్రాల నిర్మాతలు సాధారణంగా చేసే సినిమాలే చేశారు. కానీ ఇతరులు సరికొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో సినిమా స్టైల్ మారుస్తున్నారు. ఇక్కడ మనం భాష, సంస్కృతిలో ఒదిగిపోయినప్పుడే సినిమాలు పనిచేస్తాయి ” అని అన్నారు.
రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అనురాగ్. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, డేవ్ డి వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన దో బరా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుంది.