
బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన సినిమా సిరీస్‌లలో ధూమ్ కూడా ఒకటి . 2004లో ‘ధూమ్’ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆకట్టుకునే కథా, కథనాలు, స్టైలిష్ మేకింగ్, హీరో, విలన్ ల మధ్య అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, పాటలు తదితర అంశాలు ధూమ్ కు భారీ విజయాన్ని కట్ట బెట్టాయి. దీని తర్వాత, 2006లో వచ్చిన ‘ధూమ్ 2’ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ప్రధా న పాత్రలో నటించాడు. ఆపై ఆమిర్ ఖాన్ నటించిన ‘ధూమ్ 3’ 2013లో విడుదలైంది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘ధూమ్ 4’ కూడా రాబోతోంది. ఇందులో బాలీవుడ్ చాక్లెట్ బాయ్, యానిమల్ హీరో రణబీర్ కపూర్ విలన్ గా నటించనున్నాడని తెలుస్తోంది. తన లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి అనేక యాక్షన్ సినిమాల్లో నటించిన రణ్ బీర్ ఇప్పుడు ‘ధూమ్ 4’ సినిమాలోనూ దొంగగా నటించనున్నాడని తెలుస్తోంది. నిర్మాత ఆదిత్య చోప్రా ఇప్పటికే ఈ సినిమా గురించి హీరోతో మాట్లాడాడని తెలుస్తోంది. రణబీర్ కపూర్ కూడా ఇందులో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్.
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘ధూమ్’ సినిమా సిరీస్ నాల్గవ భాగానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా స్క్రిప్ట్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ త్వరలో ప్రారంభమవుతుంది. ‘ఖాకీ’, ‘వార్’, ‘బ్లఫ్ మాస్టర్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు స్క్రీన్ ప్లే రాసిన నిర్మాత ఆదిత్య చోప్రా, శ్రీధర్ రాఘవన్ సంయుక్తంగా ఈ సినిమా స్క్రీన్ ప్లేను పూర్తి చేశారు.
రణబీర్ కపూర్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రామాయణం ఆధారంగా రూపొందే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ చిత్రంతో బిజీ కానున్నాడు. ఆ తర్వాత ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్ పార్క్’కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ‘ధూమ్ 4’లో రణ్ బీర్ నటిస్తాడని సమాచారం.