
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఆయన హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ అసభ్యకరంగా ఉందని.. దానిని నిలిపివేయాలంటూ కొంతమంది సల్మాన్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన పోలీసులు.. 22పై సెక్షన్ 37(3), 143 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు సల్మాన్‌కు మరింత భద్రను పెంచారు.
కాగా షో పేరుతో బిగ్‌బాస్‌లో లవ్ జిహాదీని ప్రోత్సహిస్తున్నారని.. ఈ షోను ఆపాలంటూ ట్రేడర్స్ యూనియన్.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ.. షో గురించి నివేదికను ఇవ్వాలంటూ అధికారులను సూచించానని.. అందులో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా షోపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మరోవైపు కర్ని సేన కూడా ఈ షోపై జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ షోను కుటుంబం మొత్తం కూర్చొని చూడలేదని.. ఇందులో లవ్ జిహాదీని ప్రోత్సహిస్తున్నారంటూ వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ కూడా షోలో అసభ్యత పెరుగుతుందని.. దాన్ని వెంటనే ఆపేయాలంటూ డిమాండ్ చేశారు.
వివాదం ఎలా మొదలైదంటే..!
బీఎఫ్ఎఫ్(బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్) కింద నచ్చిన కంటెస్టెంట్‌లు ఓ బెడ్‌ను షేర్ చేసుకోవాలంటూ బిగ్‌బాస్ ఓ రూల్‌ను పెట్టాడు. దీతో మహిరా శర్మ తన స్నేహితుడు అజిమ్ రియాజ్‌తో ఒకే బెడ్‌ను షేర్ చేసుకుంది. దీన్ని ప్రేక్షకులు తీవ్రంగా ఖండిచారు. షోలో లవ్ జిహాద్‌ను పెంచుతున్నారంటూ అందరూ విమర్శలు గుప్పించారు. దీంతో వివాదం కాస్త మొదలై.. చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ రూల్స్‌ను మార్చేశాడు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌తో బెడ్‌ను షేర్ చేసుకోవచ్చంటూ దాన్ని మార్చేశాడు. అయితే అప్పటికే వివాదం పెద్దది కాగా.. చాలామంది సల్మాన్‌ను అన్‌ఫాలో అవుతున్నట్లు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బిగ్‌బాస్ వివాదం: దబాంగ్ 3పై ఎఫెక్ట్
ఇదిలా ఉంటే ఈ షో వివాదం కాస్త సల్మాన్ సినిమాలకు కూడా చుట్టుకుట్టొంది. ఈ షోను ఆపకపోతే సల్మాన్ తదుపరి చిత్రం దబాంగ్ 3ను అడ్డుకుంటామని కర్ణిసేన హెచ్చరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సల్మాన్ ఎలా రియాక్ట్ అవుతాడు.. షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.