AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 telugu: త్రిగుణ్‌కు ఇచ్చిపడేసిన అపూర్వ.. నువ్వు చేసే పనులకు ఇరిటేటింగ్‌గా ఉంది అంటూ..

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం మొదలైన రోజే పరిస్థితులు పూర్తిగా వేడెక్కిపోయాయి. మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవలు, మాటల యుద్ధాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా అపూర్వ–షాలినీ, రోహిత్–త్రిగుణ్, అమన్–షాలినీ మధ్య జరిగిన వాగ్వాదాలు హౌస్‌లో హీట్ పెంచేశాయి

Bigg Boss 10 telugu: త్రిగుణ్‌కు ఇచ్చిపడేసిన అపూర్వ.. నువ్వు చేసే పనులకు ఇరిటేటింగ్‌గా ఉంది అంటూ..
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Sep 30, 2026 | 7:36 AM

Share

బిగ్ బాస్ హౌస్‌లో నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ ఊహించని మలుపులతో సాగింది. మాములుగా నామినేషన్స్ అంటే కంటెస్టెంట్ల మధ్య ఆరోపణలు, వాదనలు కామన్. కానీ ఈసారి మాత్రం వ్యక్తిగత విభేదాలు కూడా బయటకు రావడంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా త్రిగుణ్, రోహిత్, అమన్, అపూర్వల మధ్య జరిగిన వాగ్వాదాలు ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. ముందుగా భైరవ టీమ్‌లోని ప్రతి సభ్యుడికి ఒక్కో కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే అవకాశం కల్పించారు. మరోవైపు సప్తశక్తి టీమ్‌లో ఉన్న అందరికీ ఈ అవకాశం ఇవ్వకుండా కేవలం ఇద్దరిని మాత్రమే నామినేషన్ పవర్ కోసం సెలక్ట్  చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ఇద్దరిని సప్తశక్తి టీమ్ సభ్యులే నిర్ణయించుకోవాల్సి వచ్చింది. నామినేషన్ చేసే సమయంలో ఆ కంటెస్టెంట్ ముఖంపై నురుగు స్ప్రే చేయాలని బిగ్ బాస్ చెప్పారు. ఇప్పటికే ముకేష్ నేరుగా నామినేట్ కావడంతో పాటు, కెప్టెన్‌గా ఉన్న అపూర్వను కూడా నామినేట్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేశాడు. దీంతో సప్తశక్తి టీమ్‌లో నామినేషన్ పవర్ ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తిని రేపింది.

చివరికి త్రిగుణ్ నామినేషన్ చేసే అవకాశం తనకే కావాలని పట్టుబట్టడంతో అతడిని ఒకరిగా ఎంపిక చేశారు. మరోవైపు నరేష్‌కు కూడా ఈ అవకాశం దక్కింది. నామినేషన్స్ మొదలు కాగానే త్రిగుణ్.. రోహిత్‌ను టార్గెట్ చేశాడు. ఒకే విషయాన్ని వ్యక్తులను బట్టి వేర్వేరు విధాలుగా చూస్తున్నాడంటూ రోహిత్‌పై విమర్శలు చేశాడు. గతంలో జరిగిన ఓ ఘటనను ప్రస్తావిస్తూ తన మాటలను రోహిత్ వేరే విధంగా చూపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు త్రిగుణ్. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో అనుకోకుండా తన నోటి నుంచి వచ్చిన తుంపర్లు రోహిత్ ముఖంపై పడటాన్ని రోహిత్ ప్రస్తావించాడు. అయితే  దానిని ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా చూపిస్తున్నారని త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

అయితే రోహిత్ మాత్రం తన ముఖంపై పడిన తుంపర్లను అసహ్యంగా అనిపించి తుడుచుకున్నానని చెప్పాడు. అలాగే త్రిగుణ్ తనను ‘ఐ లవ్యూ’ అంటూ హేళన చేస్తున్నాడని ఆరోపించాడు. తన నోటినుంచి ఆ మాట రాలేదని, తన క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా త్రిగుణ్ ఒక స్టోరీ తయారు చేస్తున్నాడని రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత నరేష్ తన నామినేషన్‌కు అమన్‌ను ఎంచుకున్నాడు. షో మొదటి రెండు వారాల్లో కనిపించిన అమన్‌కు, ప్రస్తుతం కనిపిస్తున్న అమన్‌కు చాలా తేడా ఉందని నరేష్ అన్నాడు. చిన్న చిన్న విషయాలకే అమన్ త్వరగా స్పందిస్తున్నాడని, ఇంట్లో జరిగే చాలా గొడవల్లో అతని ప్రమేయం కనిపిస్తోందని చెప్పాడు. అతనితో మాట్లాడాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నాడు నరేష్. అంతేకాకుండా టాస్క్‌ల విషయంలోనూ, సంచాలక్ బాధ్యతల్లోనూ, ఇంటి పనుల్లోనూ అమన్ అంత ఇంట్రెస్ట్ గా లేడని నరేష్ ఆరోపించాడు.

దీనికి అమన్ స్పందిస్తూ.. తనను కావాలనే గొడవలకు లాగుతున్నట్టుగా అనిపిస్తోందని అన్నాడు. నామినేషన్స్ ముందుగానే నిర్ణయించుకుని చేస్తున్నారనే డౌట్ కలుగుతోందని అన్నాడు అమన్. అమన్ కూడా నామినేషన్‌లో త్రిగుణ్‌ను ఎంచుకున్నాడు. త్రిగుణ్‌కి ‘మ్యానిప్యులేటర్’ అనే ఇమేజ్ ఉందని, అయితే అతడు ఇంకోరువల్ల ఇంఫులెన్స్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడని అమన్ అన్నాడు. మిథిలేష్‌కు సంబంధించిన గత ఘటనను ప్రస్తావిస్తూ త్రిగుణ్ మొదట ఒక రకంగా మాట్లాడి, ఆ తర్వాత క్షమాపణ చెప్పాడని.. మళ్లీ ఇతరుల మాటలు విని అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడని అమన్ అన్నాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. అమన్‌తో మాట్లాడే సమయంలో త్రిగుణ్ ఉపయోగించిన మాటలుపై కూడా వివాదం రేగింది. దీంతో త్రిగుణ్ వెంటనే స్పందిస్తూ తాను కావాలని అలా మాట్లాడలేదని, సోదరుడిలా భావించి ఆ విధంగా పిలిచానని వివరణ ఇచ్చాడు. ఇకపై ‘అమన్ గారు’ అని మాత్రమే పిలుస్తా అంటూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. నామినేషన్స్‌లో అపూర్వ కూడా త్రిగుణ్‌ను ఎంపిక చేసింది. హౌస్‌లో త్రిగుణ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతరులను ఉద్దేశించి మాట్లాడే సమయంలో త్రిగుణ్ ఉపయోగించే మాటలు తనకు నచ్చడం లేదని చెప్పింది. ముఖ్యంగా రోహిత్‌తో జరిగిన గత వాగ్వాదాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలను అపూర్వ తప్పుబట్టింది. అలాగే అమన్‌తో మాట్లాడే సమయంలో నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది అంటూ మాట్లాడటం సరికాదని ప్రశ్నించింది. ఇంటి పనులు చేసే సమయంలో ఏదైనా తప్పు జరిగితే దానిని చూపిస్తూ అవమానకరంగా మాట్లాడితే ఇతరులు ఎలా స్పందిస్తారో ఆలోచించాలని సూచించింది. అతడి వెటకారపు నవ్వు, ఇతరులను రెచ్చగొట్టే విధానం తనకు చిరాకు తెప్పిస్తోందని పేర్కొంది. త్రిగుణ్‌కు సంబంధించి హౌస్‌లో తనకు నచ్చని విషయాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ అపూర్వ తన వాదనను వినిపించింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ వాగ్వాదంతో నామినేషన్స్ ప్రక్రియ మరింత వేడెక్కింది. ఆతర్వాత రామ్ ప్రసాద్.. షాలినిని నామినేట్ చేయగా, రోహిత్.. దేబ్జానీని నామినేట్ చేశాడు. వర్షిణి.. సృష్టిని నామినేట్ చేసింది. మరోవైపు వంశీ, సుధీర్ ఇద్దరూ చరణ్‌ను నామినేట్ చేశారు. మొత్తంగా నాలుగో వారం నామినేషన్స్ లో ముకేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, చరణ్, నరేష్, సృష్టి నామినేట్ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us