దుమ్ముదుమారమే.. సీఎం హోదాలో తొలిసారి సిరిసిల్లకు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ బహిరంగ లేఖ..
సిరిసిల్లపై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇవాళ సుమారు రూ.345 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే బీఆర్‌ఎస్ కంచుకోటగా భావిస్తున్న సిరిసిల్లలో.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఆసక్తి రేపుతోంది. బీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రులు ఆరోపిస్తున్న తరుణంలో.. ఆ పార్టీ నేతలు కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తుండటంతో రాజకీయంగా వేడి రాజుకుంది.

సీఎం హోదాలో తొలిసారి సిరిసిల్లకు రాబోతున్నారు రేవంత్‌రెడ్డి. సుమారు రూ.345 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అభివృద్ధితో పాటు రాజకీయంగా పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల రేవంత్ రెడ్డి.. కేటీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లకు నేను వస్తాను.. నీ సంగతి చూస్తానంటూ.. మాట్లాడారు. అంతేకాకుండా సిరిసిల్ల సెగ్మెంట్లో 8,000 కు పైగా ఎకరాల భూమి కబ్జాకు గురైందని, కేటీఆర్ బినామీలే కబ్జా చేశారని ఆరోపించారు.
అయితే ఈ అంశంపైన కేటీఆర్ కూడా స్పందించారు. ఎనిమిది వేల ఎకరాల భూమి కబ్జాకు గురైతే గ్రామాల వారిగా సర్వే నెంబర్లతో బయటపెట్టాలని కోరారు. అంతేకాకుండా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సిరిసిల్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధికి నిధులను విడుదల చేస్తూ హామీలిస్తున్నారు. వేములవాడ దేవస్థానంతో పాటు మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యను కూడా పరిష్కరిస్తామని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పర్యటన నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కింది. కేటీఆర్ హయాంలో సిరిసిల్లలో అవినీతి అక్రమాల జరిగాయని ఆరోపిస్తున్న ప్రభుత్వ విప్ శ్రీనివాస్.. ఎనిమిది వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. ఇకనుంచి కేటీఆర్ కు కౌన్డౌన్ మొదలైందని అన్నారు.
ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్‌ఎస్ నేతల విమర్శలు ప్రతివిమర్శల నేపథ్యంలో సిరిసిల్లలో రాజకీయంగా వేడెక్కింది. కౌంట్‌డౌన్ మొదలైంది కేటీఆర్‌కు కాదని, సీఎం రేవంత్ రెడ్డికే అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న రవిశంకర్.. సిరిసిల్లకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో.. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి, మహిళల సాధికారతతో పాటు విద్య, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
