AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాకీ వెనుక ఓ మంచి మనసు.. తల్లి SI పరీక్ష రాసే వరకు చిన్నారికి అమ్మగా మారిన పోలీస్!

నల్గొండ జిల్లాలో ఓ పోలీస్ సిబ్బంది తన మంచి మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఎస్ఐ పరీక్ష రాసేందుకు చిన్నారితో వచ్చిన ఓ మహిళకు కుటుంబ సభ్యులెవరూ తోడుగా లేకపోవడంతో ఆమె ఇబ్బందిని గుర్తించిన డిండి మండలానికి చెందిన పోలీస్ సిబ్బంది షర్పుద్దీన్ మానవత్వంతో స్పందించారు. తల్లి పరీక్ష రాసి వచ్చే వరకు చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకుని చూసుకున్నారు. విధి నిర్వహణలోనే మానవత్వాన్ని చాటిన ఆయన చర్య నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది..

ఖాకీ వెనుక ఓ మంచి మనసు.. తల్లి SI పరీక్ష రాసే వరకు చిన్నారికి అమ్మగా మారిన పోలీస్!
Telangana Cop Holds Baby So Mother Can Appear For Si Exam
Srilakshmi C
|

Updated on: Nov 29, 2026 | 1:05 PM

Share

పోలీసులు అంటే కేవలం చట్టాన్ని కాపాడేవారు మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో ఆపన్నులకు అండగా నిలిచి, మానవత్వాన్ని చాటేవారు కూడా అని మరోసారి నిరూపించారు నల్గొండ జిల్లాకు చెందిన ఓ పోలీస్ సిబ్బంది. విధి నిర్వహణలో భాగంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, ఓ మహిళ తన జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నారు. తల్లి పరీక్ష రాసే సమయంలో ఆమె చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ఆడిస్తూ, ఆ తల్లికి భరోసాగా నిలిచారు. నల్గొండ జిల్లాలో ఎస్ఐ పరీక్ష రాసేందుకు ఓ మహిళ తన చిన్నారితో కలిసి పరీక్ష కేంద్రానికి చేరుకుంది. అయితే, ఆ సమయంలో ఆమెకు తోడుగా కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో చిన్నారిని చూసుకుంటూ పరీక్ష రాయడం ఎలా అని ఆందోళన చెందింది. ఒకవైపు ఎంతోకాలంగా కష్టపడి సిద్ధమైన పరీక్ష.. మరోవైపు తనను విడిచి ఉండలేని పసిబిడ్డ. దీంతో ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

పరీక్ష రాసేందుకు వెళ్లాలంటే చిన్నారిని ఎవరి దగ్గర వదిలి వెళ్లాలో తెలియక ఆ మహిళ సతమతమైంది. తన భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పరీక్షను వదులుకోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందింది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న డిండి మండలానికి చెందిన పోలీస్ సిబ్బంది షర్పుద్దీన్ ఆ మహిళ పరిస్థితిని గమనించారు. ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆయన వెంటనే మానవత్వంతో స్పందించారు. చిన్నారిని చూసుకునేందుకు ఎవరూ లేరని తెలుసుకున్న షర్పుద్దీన్, ఏమాత్రం సంకోచించకుండా ఆ పసిబిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని ఆడిస్తూ, చిన్నారికి ధైర్యం చెప్పారు. తల్లి ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాసి వచ్చేలా భరోసా కల్పించారు. దీంతో ఆ మహిళ ప్రశాంతంగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లి తన పరీక్ష రాసే అవకాశం పొందింది. తల్లి తన భవిష్యత్తు కోసం పరీక్ష రాస్తున్న సమయంలో చిన్నారికి అండగా నిలిచిన షర్పుద్దీన్ చర్య అక్కడున్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా పోలీసులంటే కఠినంగా ఉంటారని, విధి నిర్వహణలో నిబంధనలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని చాలామంది భావిస్తుంటారు. కానీ ఖాకీ దుస్తుల వెనుక కూడా ఒక సున్నితమైన మనసు ఉంటుందని షర్పుద్దీన్ తన చర్యతో నిరూపించారు. ఒక మహిళ తన కలను సాకారం చేసుకునేందుకు పరీక్ష రాయడం ఎంత ముఖ్యమో గుర్తించి, ఆమెకు అవసరమైన సహాయం అందించారు. చిన్నారిని కాసేపు చూసుకోవడం చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో ఆ తల్లికి అది ఎంతో విలువైన సహాయం. ఓవైపు పోలీస్ విధులు.. మరోవైపు పసిబిడ్డపై ఆప్యాయత.. రెండింటినీ సమన్వయం చేస్తూ షర్పుద్దీన్ చూపించిన మానవత్వంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పలువురు పోలీస్ సిబ్బంది షర్పుద్దీన్‌ను అభినందిస్తున్నారు. విధి నిర్వహణ అంటే కేవలం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే కాదని, ప్రజల కష్టాలను అర్థం చేసుకుని అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడమని ఆయన నిరూపించారని కొనియాడుతున్నారు. ఒక తల్లి తన పిల్లల భవిష్యత్తుతో పాటు తన భవిష్యత్తు కోసం కూడా పోరాడుతున్న సమయంలో ఆమెకు సహాయం చేయడం నిజంగా అభినందనీయమని పలువురు అంటున్నారు. ఖాకీ అంటే కేవలం అధికారం, బాధ్యత మాత్రమే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ధైర్యం, అవసరమైనప్పుడు ఆదుకునే మంచి మనసు కూడా. ఒక చిన్నారి పట్ల చూపిన ఆప్యాయతతో ఓ తల్లి కలకు అండగా నిలిచిన షర్పుద్దీన్ నిజంగా అభినందనలకు అర్హులు.

Follow Us