aha Telugu Indian Idol 2: భారతదేశంలో ఎదురులేని ప్రాంతీయ OTT ప్లాట్‌ఫారమ్, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కైవసం చేసుకున్న ‘ఆహా’లో.. విస్మయపరిచే సంగీత మహోత్సవమైన ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ఫైనల్ స్జేజ్‌కి వచ్చింది. ఈ మేరకు సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేసే 25 ఎపిసోడ్‌ల తర్వాత, ప్రతిభావంతులైన 10,000 మంది పోటీదారుల నుంచి టాప్ 5 ఫైనలిస్టులను గర్వంగా పరిచయం చేయబోతోంది. నిజనాకి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గాయకులు అంతకముందు సీజన్‌లోని వారిని అధిగమిస్తూ, అసాధారణమైన సంగీత ప్రతిభకు పట్టం కట్టారు. ఇందులో జడ్జింగ్ ప్యానెల్‌లో ఉన్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, గాయకురాలు గీతామాధురి, మాస్ట్రో కార్తీక్‌తో పాటు, డైనమిక్ హోస్ట్ హేమ చంద్ర మార్గదర్శకత్వంతో ఇండియన్ ఐడల్ 2 ప్రోగ్రామ్ అపూర్వమైన ఎత్తులకు చేరుకుంది.
ఆడిషన్లు, ప్రదర్శనలతో మొదలుకొని సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఈ షో విజయం సాధించింది. ఈ ప్రయాణంలో ఇండియన్ ఐడల్ 2 ఫైనలిస్ట్‌లు వారి అసాధారణమైన పరాక్రమానికి నిదర్శనంగా నిలిచారు. ఇక టాప్ 5 ఫైనలిస్ట్‌లుగా నిలిచిన న్యూజెర్సీకి చెందిన శృతి, హైదరాబాద్‌కు చెందిన జయరామ్, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతుల తమ అసమాన ప్రతిభ, అకుంఠిత దీక్ష, ఆకట్టుకునే ప్రదర్శనలతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
మరోవైపు ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’ ఫైనల్ దశకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కి ముఖ్య అతిధిగా అల్లు అరవింద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు ప్రకటించారు. ఇక బన్నీకి సంగీతం పట్ల ఉన్న అపారమైన మక్కువ ఈ ప్రొగ్రామ్ ఫినాలేలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాస్తవానికి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2.. సంగీత నైపుణ్యంలోని సరిహద్దులను పునర్నిర్వచించింది. ఇంకా ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ట్రయల్‌బ్లేజర్‌గా దాని స్థానాన్ని బలోపేతం చేసింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 కనబర్చిన ఈ సంచలనాత్మక ప్రదర్శన ఔత్సాహిక గాయకులకు సువర్ణావకాశ్ని అందించే వేదికగా ఉండడమే కాక, తెలుగు సినిమాకి ఉన్న గొప్ప సంగీత వారసత్వం ద్వారా అనేక మంది ప్రేక్షకులను ఏకం చేసింది.