Aarudra: సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర, అంత్యప్రాసలే ఆయన వ్రాలుముద్ర..

సంగీత దర్శకులిచ్చిన బాణీలకు సమయానుకూలంగా, సునాయాసంగా, సరళంగా పాటలు రాయగలిగిన కవుల్లో ఆయన ఆగ్రేసరుడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని మనకందించిన సరస్వతి పుత్రుడు.

Aarudra: సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర, అంత్యప్రాసలే ఆయన వ్రాలుముద్ర..
Aarudra
Follow us
Balu

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 04, 2021 | 4:29 PM

సంగీత దర్శకులిచ్చిన బాణీలకు సమయానుకూలంగా, సునాయాసంగా, సరళంగా పాటలు రాయగలిగిన కవుల్లో ఆయన ఆగ్రేసరుడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని మనకందించిన సరస్వతి పుత్రుడు. ఆయన సహృదయుడు. రస హృదయుడు. సరస హృదయుడు. సంప్రదాయ పరిజ్ఞానం. పాత్రోచిత భాషా ప్రయోగం. అంత్యప్రాసలు ఆయన ప్రత్యేకతలు. సామ్యవాదాన్ని పాటల్లో ఎలా వండగలరో…భక్తి భావాన్ని కూడా అంతే బాగా పండించగలరు. హాస్యాన్ని ఎలా దట్టించగలరో వ్యంగ్యాన్ని కూడా అంతే బాగా పుట్టించగలరు. ఒకటని కాదు. అన్ని రకాల పాటలను ఆయన రాశారు. తెలుగు సినిమా పాటల్లో ఆయనది అనితర ముద్ర. ఆయనే ఆరుద్ర. ఇవాళ ఆయన సాహితీమూర్తి వర్ధంతి…

సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర. అంత్యప్రాసలే ఆయన వ్రాలుముద్ర. మాటలు వన్‌డడంలో గడసరి. పాటలు పేనడంలో పొడగరి. జీవితం అంత అద్భుతంగా ఉపమించడంలో నేర్పరి. పొయట్రిక్స్‌ ప్రయోగించడం సరేసరి. అర్జెంట్‌ రచనల్లో కూడా మరి అరమెరుపైనా తప్పనిసరి .ఇది ఆరుద్ర గురించి ముళ్లపూడి వెంకట రమణ వ్యాఖ్యానం. నిజమే. ఆరుద్ర పాటకు సంతకం అక్కర్లేదు. ఆయన పాటను ఇట్టే గుర్తు పట్టేయవచ్చు.. ఆరుద్ర అసలు పేరు భాగవతుల శంకరశాస్త్రి.. విశాఖపట్టణంలో ఆరుద్రా నక్షత్రాన జన్మించారు. మహాకవి శ్రీశ్రీ ఆయనకు మామయ్య వరుస. అందుకేనేమో చిన్నప్పట్నుంచే ఆరుద్ర వరుసపెట్టి కవితలు రాశారు.. కవిత్వంపై మనసు పారేసుకున్నారు.. కనబడిన కావ్యాన్నీ..గ్రంథాన్నీ చదవిపారేశారు…కవితలు…గేయాలు రాయడం మొదలు పెట్టారు… పదమూడో ఏట చిత్రగుప్త పత్రికలో తొలి కవిత వచ్చింది. అది మొదలు… అప్పట్నుంచి ఆరుద్ర గేయాలు… కవితలు ..పద్యాలు పత్రికల్లో రావడం ఆరంభించాయి.. అది యుద్ధకాలం… విశాఖపట్నంపై బాంబులు పడనున్నాయనే పుకారుతో అందరూ వూరొదిలిపెట్టి తలోదారి చూసుకున్నారు.. ఆరుద్రేమో విజయనగరం వచ్చి డిగ్రీలో చేరారు.. పట్టభద్రుడు కాకుండానే చదువుకు ఎగనామం పెట్టేసి రాయల్‌ ఇండియన్‌ విమాన దళంలో చేరారు..యుద్ధంలో వుంటూ సొంత పేరుతో సాహితీసేద్యం చేయడం కుదరదు కాబట్టే.. తన జన్మనక్షత్రం పేరుతో రాశారు. ఆఖరి సిరాచుక్క వరకు అదే పేరును కంటిన్యూ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎయిర్‌ఫోర్స్‌కి గుడ్‌బై చెప్పి ఆనందవాణిలో ఆరేళ్లు సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు..

ఆరుద్రకు మద్రాస్‌పై మోజు తగ్గింది. సొంతూరి మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది… వెంటనే పెట్టాబేడా సర్దుకొని విశాఖకొచ్చేశారు. అక్కడ హార్బర్‌లో క్లర్క్‌గా చేరారు.. ఆ పనిలో వుంటూనే త్వమేవాహం రాశారు.. కొన్నాళ్లకు ఆ ఉద్యోగం కూడా ఊడింది.. మళ్లీ మద్రాస్‌ బండెక్కారు.. నిరుద్యోగిగా కొంత కాలం గడిపారు… కడుపు నింపుకోవడం కోసం ఢంకా అనే పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా చేరారు.. రోజంతా ప్రూఫులు దిద్దితే ఢంకా చారిగారు టిఫిను..భోజనం పెట్టి.. ఓ సిగరెట్‌ ప్యాకెట్‌ కొనిచ్చి… ఓ రూపాయి ఇచ్చేవారు.. ఆ రూపాయితో ఆరుద్ర మూడు ఇంగ్లీషు సినిమాలు చూసేవారు.. అలా సినిమాపై పరిజ్ఞానం పెంచుకున్నారు.. ఇలా కొంతకాలం గడించింది… న్యాపతి నారాయణమూర్తి ఓ దినపత్రిక పెడుతున్నారని తెలిసి ఆయన్ను కలిసారు ఆరుద్ర.. పేపర్‌రావడానికి ఇంకా టైముంది కానీ.. అప్పటి వరకు ఖాళీగా వుండటం ఎందుకని రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీలో కథా విభాగంలో చేర్పించారు న్యాపతి.. అలా సినిమాల్లో చేరారు ఆరుద్ర..

ఆరుద్ర ప్రతిభాపాటవాలను గమనించిన సిఎస్‌ఆర్‌…ఛాయాగ్రాహకుడు కమల్‌ఘోష్‌ ఆరుద్రను పక్షిరాజా వారికి పరిచయం చేశారు… వాళ్లు తీసిన బీదలపాట్లు సినిమాలో ఓ చిలుకా రాజా అన్న పాట రాశారు.. అదే ఆరుద్ర తొలి సినిమా పాట.. ఆ తర్వాత కమల్‌ఘోష్‌ దర్శకత్వం వహించిన పరోపకారం సినిమాకు పాటలతో పాటు మాటలు కూడా రాశారు.. అయినా ఆరుద్ర పేరు అంతగా వ్యాప్తి చెందలేదు… ఆ సమయంలో ఆరుద్రకు రాజ్‌కపూర్‌ ప్రేమలేఖలు సినిమా అవకాశం వచ్చింది.. ఆ సినిమాను రాజ్‌కపూర్‌ ఏకకాలంలో మూడు భాషల్లో ప్లాన్‌ చేశారు.. తెలుగు వెర్షన్‌ రచయిత కోసం మద్రాస్‌ వచ్చారు.. అప్పుడు భరణీ రామకృష్ణ, ప్రతిభాశాస్త్రి ఆయనకు ఆరుద్రను పరిచయం చేశారు.. బొంబాయికెళ్లాక రాజ్‌కపూర్‌ వెంటనే వచ్చేయమని ఆరుద్రకు కబరు పంపారు.. కబురుతో పాటు రైలు టికెట్లు కూడా పంపించారు.. తనను విమానంలో తీసుకెళితేనే వస్తానని ఆరుద్ర పట్టుబట్టారు.. ఈ పెంకితనం రాజ్‌కపూర్‌కు బాగా నచ్చింది… ఇలాంటి పొగరు లేకపోతే సత్తా వున్న కవి ఎలా అవుతాడనుకుంటూ వెంటనే ప్లేన్‌ టికెట్లు పంపించాడు.. ప్రేమలేఖలు హిందీలో అంతగా ఆడలేదు కానీ తెలుగులో మాత్రం బ్రహ్మాండమైన విజయం సాధించింది. కారణం ఆరుద్ర పాటలే.. పందిట్లో పెళ్లవుతున్నది…. పాడు జీవితమూ యవ్వనం వంటి పాటలు మారుమోగాయి..

అది మొదలు…ఆరుద్ర పాటల ప్రవాహం ఉధృతమైంది… సినీ రంగంలో ఆరుద్ర స్థిరపడిపోయారు.. పాటల్లో తనదైన ముద్రను వేసుకున్నారు…ఆరుద్ర పాటల్లో జీవం…జవం…వేగం అన్నీ వుంటాయి… అవి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.. ఆరుద్ర సంభాషణలు హాస్యస్ఫోరకంగా వుంటాయి.. ముళ్లపూడి వెంటక రమణ పెళ్లికెళ్లినప్పుడు చిన్న చిన్న ఇళ్లల్లోంచి వెళ్లాల్సి వచ్చింది.. తలలు వంచి వెళుతుంటే… పెళ్లివారు మనకి తలవంపులు తెప్పిస్తున్నారని జోక్‌క్యం చేసుకున్నారు ఆరుద్ర. మరోసారి ఇంకో పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లినప్పుడు పాప్‌ మ్యూజిక్‌ పాడుతుంటే పుణ్య కార్యంలో పాప మ్యూజిక్‌ అంటూ చమత్కరించాడు. హిప్పీలకు తెలుగు పదమేమిటా అని అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే కుర్రసన్నాసనేస్తే సరి అని టక్కున అన్నది కూడా ఆరుద్రనే! ఆయన పాటల్లో చేసిన తమాషాలు వేసిన మషాలాలు లేవు.. ఆ మాటకొస్తే అంత్యప్రాసాలతో అడ్డమైన చాకిరీ చేయించుకుంది ఆరుద్ర ఒక్కడే!

బాపు-రమణలంటే ఆరుద్రకు ఎక్కడలేని అభిమానం… వాళ్లకి కూడా ఆరుద్రంటే ప్రత్యేకమైన ఇష్టం… సాక్షి నుంచే వీళ్ల బంధం బలపడింది… శ్రీరామాంజనేయ యుద్ధంలోని రాముడిని వివిధ కోణాల్లో ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఎదగడానికెందుకురా తొందర అన్న పాట ఎన్నో సత్యాలను చెబుతుంది. రాయినైనా కాకపోతిని పాట విషాదం నింపుతుంది. ఆరుద్ర క్లబ్‌ సాంగ్స్‌ కూడా కొన్ని రాశారు… అవి కూడా చాలా బాగుంటాయి…మ్ము మ్ము మ్ము ముద్దంటే చేదా ఇపుడా ఉద్దేశం లేదా? పాట ఈయనదే ! తీస్కో కోకాకోలా ఏస్కో రమ్ము సారా, మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల, ఏస్కో నా రాజా ఏస్కో -ఆకేస్కో వక్కేస్కో ఆపైన చూస్కో, మొదటి పెగ్గులో మజా- వేడి ముద్దులో నిషా ఇలాంటి పాటలెన్నో రాశారు ఆరుద్ర. ఏదైతేనేం…రాయడం వృత్తి అయినప్పుడు నిజాయితీగా రాయాలి.. క్లబ్‌ సాంగ్స్‌ అయితేనేం.. భక్తి పాట అయితేనేం అనేవారు ఆరుద్ర అర్ధాంగి రామలక్ష్మి..

ఆరుద్ర అక్షరశరీరుడు.. పరిశోధనా పరమేశ్వరుడు.. ఆయన సినీ కవే కాదు.. అనేక కథలు.. నాటికలు రాశారు… డిటెక్టివ్‌ కథలైతే వందకు పైగా వుంటాయి.. అభ్యుదయ కవిగా…పరిశోధకునిగా…ప్రయోగశీలిగా ఆయన తెలుగునాట సుప్రసిద్ధులయ్యారు.. పాత్రోచిత భాషా ప్రయోగం ఆయనకొక్కరికే సొంతం.. తెలుగు భాష పట్ల ఆయన మమకారం అనంతం.. సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆరుద్ర ఎంతగానో కృషి చేశారు… పాటలు రాసి వేలకు వేలు సంపాదించుకోవచ్చు… కానీ తన పరిశోధన కోసం వాటన్నింటిని కాదన్నారు.. సంవత్సరాల తరబడి పాటుబడి తన జీవితేచ్ఛను నేరవేర్చుకున్నారు.. ఆయన నిత్య పరిశోధకుడు.. సాహిత్యాభిలాషే కాదు.. చదరంగ ప్రేమికుడు కూడా.. మద్రాస్‌ చెస్‌ అసోసియేషన్‌లో లైఫ్‌టైమ్‌ మెంబర్‌…చదరంగంపై పుస్తకం కూడా రాశారాయన.. మ్యాజిక్కులు చేసేవారు.. పెయింటింగ్‌లు వేసేవారు.. ఆయనకు రోజుకు 24 గంటలు అస్సలు సరిపోయేవి కావు.. చేతిలో ఎప్పుడూ ఏదో ఓ పుస్తకం వుండాల్సిందే… పుస్తకం చదువుతూనే రాసిన సినిమా పాటలు ఎన్నో… ఇన్ని పట్టించుకున్నాయన ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోలేదు… చివరి రోజుల్లో అనారోగ్యమే ఆయన్ను కుంగదీసింది… అదే ఆయన్ను తుదిశ్వాస విడిచేలా చేసింది.. ఆరుద్ర చిరంజీవి.. ఆంధ్ర సాహిత్యానికి చేసిన సేవే ఆయన్ను చిరంజీవిని చేసింది… ఆరుద్ర సదా స్మరణీయుడు..

మరిన్ని ఇక్కడ చూడండి: YS Jagan: ‘జగన్న పాల వెల్లువ’కు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా మరో ముందడుగు..

Coriander Rice Recipe: పది నిమిషాల్లో రెడీ చేసుకునే టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు