Tamilnadu Assembly Elections : ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో.. ఓటర్లకు ఏం చెబుతున్నారో.. అంతా కన్ఫ్యూజన్. అన్నాడీఎంకేలో అమ్మ లేదు.. డీఎంకేలో కరుణ లేరు. కొత్తగా వచ్చిన పార్టీలు కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ మధ్యలో ఎగ్జిట్ పోల్ సర్వేల సందడి.. తమిళనాట అంతా సందడి సందడిగా ఉంది. ఎగ్జిట్‌పోల్స్ చూసి కార్యకర్తలు రిలాక్స్ కావద్దని… గ్రౌండ్ లెవల్లో ఫైట్ చేయాలని సూచించారు డీఎంకే అధినేత స్టాలిన్. గత ఎన్నికల్లో 1.1 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని.. ఈసారి అలాంటి పరిస్థితి రానీయవద్దని కోరారు. స్టాలిన్ తిరువణ్ణామలైలో ప్రచారం చేస్తున్న సమయంలోనే ఈ నియోజకవర్గం నుంచి డీఎంకే తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఈవీ వేలు నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఐటీ రెయిడ్స్ జరిగాయి. తిరువణ్ణామలైలోని ఈవీ వేలు కాలేజ్‌లోనే స్టాలిన్ రాత్రి బస చేశారు. తమకు పక్కా సమాచారం రావడంతోనే దాడులు చేశామని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ దాడుల్లో ఏమీ దొరకలేదని.. బీజేపీ కావాలనే కుట్రలు చేస్తోందని వేలు ఆరోపించారు.
ముఖ్యమంత్రి పళని స్వామి మధురైలో ప్రచారం చేశారు. జయలలిత ఫోటోలతో పాటు ఎంజీఆర్ లాగా మేకప్ వేసుకున్న కొంతమంది ఆర్టిస్టులు పళని ప్రచారంలో హడావుడి చేస్తున్నారు. ఇక, ఎన్నికల్లో ఖర్చుల కోసం తమిళనాట భారీగా నగదు సంచులు సరఫరా చేస్తున్నారు. పోలీసుల సోదాల్లో కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 265 కోట్ల రూపాయిల విలువైన నగదు, బంగారం, ఇతర సామాగ్రిని పట్టుకున్నారు. తిరుచ్చి జిల్లా ముసిరి నియోజక వర్గంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెల్వరాజ్ వాహనంలో కోటి రూపాయలు పట్టుబడ్డాయి. అంత సొమ్ము తన వాహనంలోకి ఎలా వచ్చిందో తెలియదంటున్నారు సెల్వరాజ్ అనుచరులు. డీఎంకే- కాంగ్రెస్ లౌకిక కూటమి నేతలు ఈ నెల 28న సేలంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ, స్టాలిన్ హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 30న ధరాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారు.
Read also : GMR Hyderabad Air Cargo : రవాణాలో కొత్త శకం, వ్యాక్సిన్ సరఫరాలో బ్లాక్‌చెయిన్ బేస్డ్ రియల్ టైమ్ ట్రాకింగ్‌ను తీసుకొచ్చిన GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో