న్యూఢిల్లీ, మే 24: దేశ వ్యాప్తంగా జూన్ 1వ రకు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశలు పూర్తైన సంగతి తెలిసిందే. ఆరో దశ ఎన్నికలు శనివారం (మే 25) జరగనున్నాయి. ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు జరగనున్నాయి. బీహార్ 8 సీట్లు, హర్యానా 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్ 1 సీటు, జార్ఖండ్ 4 సీట్లు, ఢిల్లీ 7 సీట్లు, ఒడిశా 6 సీట్లు, ఉత్తరప్రదేశ్ 14 సీట్లు, పశ్చిమ బెంగాల్ 8 సీట్లకుగానూ.. మొత్తం 889 మంది అభ్యర్ధులు పోటీ చేయనున్నారు. లాజిస్టికల్, కమ్యూనికేషన్ అండ్ కనెక్టివిటీకి సంబంధించి అడ్డంకుల కారణంగా గత నెలలో ఎన్నికల సంఘం (ECI) జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి పోలింగ్ తేదీని మే 7 నుంచి మే 25 మార్చింది. ఇక రేపు జరగనున్న ఆరో దశ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మే 25న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
6వ దశ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 14 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 470, హర్యానాలో 10 నియోజకవర్గాల నుంచి 370 నామినేషన్లు వచ్చాయి. ఈ దశలో ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థుల సగటు సంఖ్య 15 అని పోల్ బాడీ పేర్కొంది. ఏడు దశల ఎన్నికలు పూర్తైన తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.