Kerala Assebly Elections 2021:కేరళలో బీజేపీ గట్టిగా గెలిచే నియోజకవర్గం ఉందంటే అది మంజేశ్వరమే!

|

Mar 25, 2021 | 2:16 PM

అసెంబ్లీ ఎన్నికలకు అట్టే సమయం లేకపోవడంతో కేరళలో పొలిటికల్‌ హీట్‌ అమాంతం పెరిగింది.. అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఎల్‌డీఎఫ్‌, అధికారంలోకి రావాలన్న పంతంతో...

Kerala Assebly Elections 2021:కేరళలో బీజేపీ గట్టిగా గెలిచే నియోజకవర్గం ఉందంటే అది మంజేశ్వరమే!
Kerala Assebly Elections Bjps Hindu Vote Consolidation Plans
Follow us on

Kerala Assebly Elections 2021:అసెంబ్లీ ఎన్నికలకు అట్టే సమయం లేకపోవడంతో కేరళలో పొలిటికల్‌ హీట్‌ అమాంతం పెరిగింది.. అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఎల్‌డీఎఫ్‌, అధికారంలోకి రావాలన్న పంతంతో యూడీఎఫ్‌ ఎన్నికల సమరాంగణంలో సీరియస్‌గా పోరాడుతున్నాయి.. ఇంత సీరియస్‌నెస్‌లోనూ కాసింత నవ్వించేవారు ప్రతిచోటా ఉంటారు.. కేరళవాసులకు ఆ లోటు తీరుస్తున్నారు మెట్రోమ్యాన్‌ ఈ.శ్రీధరన్‌. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని ఆయన చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఈ ఎన్నికలతో కేరళలో బీజేపీ దశ మారిపోతుందని అంటున్నారు. తను పోటీ చేస్తున్న పాలక్కాడ్‌లో బీజేపీ గెలుస్తుందన్న గ్యారంటీ లేదు కానీ రాష్ట్రం మొత్తం బీజేపీ గాలి వీస్తున్నదని ఆయన చెప్పడం నిజంగానే పెద్ద కామెడీ! ప్రస్తుత పరిణామాలు చూస్తే ప్రజలంతా బీజేపీకే ఓటేస్తారని ఆయన అనుకుంటున్నారు. ఎన్టీయే అధికారంలోకి వస్తే పారదర్శకతో కూడిన, అవినీతిరహిత పాలనను అందిస్తామని శ్రీధరన్‌ ప్రచారంలో భాగంగా పలు చోట్ల అంటూ వస్తున్నారు.నిజానికి పాలక్కాడ్‌ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా శ్రీధరన్‌ పోటీ చేస్తున్నారు కాబట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాకపోతే ఓట్ల శాతాన్ని మాత్రం బీజేపీ బాగా పెంచుకుంది. పాలక్కాడ్‌ నియోజకవర్గంలో గెలిచే ఛాన్స్‌ యూడీఎఫ్‌కే ఎక్కువగా ఉంది. యూడీఎఫ్‌ 41.96 శాతం ఓట్లతో ప్రత్యర్థుల కంటే ముందున్నదన్నది సర్వేల సారాంశం. ఎల్‌డీఎఫ్‌ 37.75 ఓట్ల శాతంతో సెకండ్‌ప్లేస్‌లో ఉంది. బీజేపీకి 19.71 శాతం ఓట్లు రావచ్చు. ఈ మాత్రం ఓట్లు కూడా వస్తున్నాయంటే శ్రీధరన్‌ పోటీ చేస్తున్నారు కాబట్టేనట!

కేరళకు సంబంధించినంత వరకు బీజేపీ గెలిచే స్థానం ఏదైనా ఉందంటే అది మంజేశ్వరం నియోజకవర్గమే! అది కూడా కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్పడానికి లేదు.. ఎందుకంటే అక్కడ రాజకీయ పరిస్థితులను అంచనా వేయడం బహు కష్టం. ఎన్నికల వేళ కూడా అక్కడ సాధారణ పరిస్థితులే ఉన్నాయి. హోర్డింగ్‌లు లేవు.. హోరెత్తించే ప్రచారాలు లేవు. పార్టీల బలబలాలను చూపించే ర్యాలీలు లేవు. ఓ రకమైన నిశ్శబ్దం.. ఆ నిశ్శబ్ధ తుఫాన్‌లో ఏ పార్టీలు కొట్టుకుపోతాయో చెప్పలేం! కాసర్‌గోడ్‌ జిల్లా ప్రధాన కార్యాలయానికి ఉత్తరదిక్కుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది మంజేశ్వరం. ఇక్కడ్నుంచి విజయం సాధించాలన్నది బీజేపీ లక్ష్యం. బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. యూడీఎఫ్‌ కూటమిలో ఉన్న ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ ఇక్కడ్నుంచి పోటీ చేస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ పోటీ చేస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లింది.. మంజేశ్వరం కర్నాటక సరిహద్దుల్లో ఉండటంతో ఆ రాష్ట్రం నుంచి బీజేపీ నేతలు వస్తున్నారు. హిందుత్వ నినాదంతో ప్రచారం చేస్తున్నారు. హిందువుల ఓట్ల సమీకరణపై దృష్టి పెట్టారు. ఇలా హిందువుల ఓట్లను రాబట్టుకోవడం వల్ల బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుందేమో కానీ విజయానికి అవసరమైన ఓట్లను సంపాదించుకోగలదా అన్నది అనుమానంగానే ఉంది. ఇందుకు కారణం ఇక్కడ పోటీలో ఉన్న ఐయుఎమ్‌ఎల్‌ అభ్యర్థి ఎకెఎమ్‌ అష్రఫ్‌ బలంగా ఉండటం! పైగా మంజేశ్వరం నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 53 శాతం ఉన్నాయి. ముస్లింలంతా గంపగుత్తగా అష్రఫ్‌కే ఓటు వేస్తారని అనుకోడానికి లేదు. కొందరు ఎల్‌డీఎఫ్‌కు వేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ సిద్ధాంతాలు పడని హిందువులు, క్రిస్టియన్లు అష్రఫ్‌ పక్షాన నిలబడే వీలుంది. ఇక్కడ హిందువుల ఓట్లు 45 శాతం వరకు ఉన్నాయి. క్రిస్టియన్ల ఓట్ల శాతం రెండో మూడో ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో లెఫ్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌-ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి వి.వి.రమేశన్‌కు సీపీఎం సంప్రదాయ ఓట్లు మాత్రమే పడే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎల్‌డీఎఫ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుంది. మంజేశ్వరం నియోజకవర్గం నుంచి గత ఏడు ఎన్నికలలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఐయుఎమ్‌ఎల్‌ అభ్యర్థులు గెలిచారు. పోటీ చేసిన ప్రతీసారి బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌ గెలిచేంత పనిచేశారు. యూడీఎఫ్‌ అభ్యర్థి పి.పి.అబ్దుర్‌ రజాక్ చేతిలో కేవలం 89 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈ ఎన్నికల ఫలితంపై సురేంద్రన్‌ హైకోర్టుకు వెళ్లారు. అయితే 2018లో రజాక్‌ చనిపోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు సురేంద్రన్‌.

ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ అభ్యర్థి ఎమ్‌.సి.కమ్రుద్దీన్‌ బీజేపీ అభ్యర్థి రవిషాతంత్రిపై 7,923 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మూడోసారి ఎన్నికల బరిలో దిగుతున్న సురేంద్రన్‌ బీజేపీ జాతకాన్ని మారుస్తారా లేదా అన్నది చూడాలి. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో 2019 ఉప ఎన్నికతో పోలిస్తే యూడీఎఫ్‌ ఆధిక్యాన్ని 2,903 ఓట్లకు తగ్గించగలిగింది బీజేపీ. కాంగ్రెస్‌, సీపీఎంల పట్ల సానుకూలంగా ఉన్న హిందువులను ఓసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలంటూ విన్నవించుకుంటున్నామని కమలనాథులు చెబుతున్నారు. మంజేశ్వరంలో ఉన్న గ్రామ పంచాయతీలలో ఎనిమిది ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. 2019లో జరిగిన ఉప ఎన్నికలో ఒర్కాడీ గ్రామపంచాయితీలో యూడీఎఫ్‌కు కేవలం 578 ఓట్ల ఆధిక్యమే లభించింది. మీంజా పంచాయితీలో బీజేపీ 1,078 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. పైగా 2016 ఎన్నికల్లో సురేంద్రన్‌ 89 ఓట్ల తేడాతో ఓటమి చెందారన్న సానుభూతి ప్రజల్లో ఉంది. 2019 ఉప ఎన్నికలో పైవలికె పంచాయతీలో ఎన్డీయేకు 1998 ఓట్ల ఆధిక్యం లభించింది. కుంబ్లా, ఎన్‌మకజె, పుతిగె, మంగలపాడి గ్రామపంచాయితీలలో ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ అనుకుంటోంది. కుంబ్లా పంచాయతీకి సంబంధించినంత వరకు ఉప ఎన్నికలో యూడీఎఫ్‌కు 3,676 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మిగతా పంచాయితీలలో కూడా యూడీఎఫ్‌కు స్పష్టమైన మెజారిటీ రావడంతో గెలుపొందగలిగింది.ఇప్పుడు యూడీఎఫ్‌ నుంచి పోటీ చేస్తున్న అష్రఫ్‌ స్థానికుడు కావడం కూడా కలిసి వచ్చే అంశం. ఇక్కడ బీజేపీ జెండా ఎగురుతుందా? లేక యూడీఎఫ్‌ సీటును నిలబెట్టుకోగలుగుతుందా? అన్నది తెలియాలంటే మే 2వరకు ఆగాల్సిందే!

మరిన్ని చదవండి ఇక్కడ :భారత్‌లో మితిమీరి రెచ్చిపోతున్న కరోనా సెకండ్ వేవ్..18 రాష్ట్రలో లాక్‌డౌన్..? : Coronavirus in India video.

నడిరోడ్డుపై తలస్నానం, షేవింగ్ చేస్తూ హల్ చల్ చేసిన వ్యక్తి. ..వైరల్ అవుతున్న వీడియోలు,ఫోటోలు : man bathing on Road Video

 ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా..వీడి చేష్టలకు నెటిజెన్ల ఫిదా !:Little Boy Funny Video.