
Karnataka Elections 2023: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నారు. మళ్లీ అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అయితే తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పూర్తి ధీమాతో ఉంది. అటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ నుంచి ఎవరు సీఎం అవుతారన్న అంశంపై ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ విషయంలో మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో వారి మధ్య అంతా సవ్యంగా లేదన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏఎన్‌ఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, తన రాజకీయ భవితవ్యంపై సిద్ధరామయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తనకు చివరివిగా పేర్కొన్న ఆయన.. దీని తర్వాత తాను ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్ కానున్నట్లు చెప్పారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు తన స్వగ్రామం ఉన్న వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత తాను క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని.. అయితే ఎలాంటి పార్టీ పదవులను అంగీకరించబోనని స్పష్టంచేశారు. సీఎం పదవి విషయంలో తనకు, డీకే శివకుమార్‌కు మధ్య విబేధాలు నెలకొన్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అయినా.. ప్రజాస్వామ్యంలో బేదాభిప్రాయాలు సహజమేనని.. చివరకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
Siddaramaiah
కర్నాటకలో అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో మే 10న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో బీజేపీకి 119 మంది సభ్యులుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి 75 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ నుంచి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..