కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు? డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Karnataka Polls 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే సీఎం పదవి ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు? డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Siddaramaiah, DK Shivakumar (File Photo)
Image Credit source: TV9 Telugu

Updated on: Apr 06, 2023 | 2:57 PM

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే సీఎం పదవి ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై డీకే శివకుమార్ స్పందించారు.  సీఎం పదవి విషయంలో తమ మధ్య లుకలుకలున్నాయన్న కథనాల్లో వాస్తవం లేదని ఆయన  స్పష్టంచేశారు. కష్టకాలంలో పార్టీకి విశ్వసనీయంగా వెన్నంటి ఉన్న వ్యక్తికి, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తికి పార్టీ అధిష్టానం సరైన సమయంలో రివార్డు ఇస్తుందని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్వాసం వ్యక్తంచేశారు. తాను పార్టీకి మొదటి నుంచీ విశ్వసనీయంగా ఉన్నానని, ఎప్పుడూ పార్టీ నమ్మకాన్ని వమ్ముచేయలేన్నారు.

ప్రస్తుతం తమ ఫోకస్ పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పైనే ఉందన్న డీకే శివకుమార్.. మిగిలిన అంశాలను పార్టీ అధిష్టానానికి వదిలిపెడుతున్నట్లు చెప్పారు. పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తులకు పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కష్టకాలంలో పీసీసీ సారథ్య పగ్గాలు చేపట్టిన తాను.. పార్టీని బలోపేతం చేసేందుకు అవిశ్రాంతంగా పనిచేసినట్లు డీకే శివకుమార్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మూలా పర్యటించానని, బీజేపీకి ధీటుగా పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు శ్రమించినట్లు వివరించారు.

అదే సమయంలో సీఎం పదవి రేసులో నిలుస్తున్న సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టంచేశారు. కర్నాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తామిద్దరూ కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. అయితే తమ ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అలాగే మీడియాలో ఓ వర్గం తమ మధ్య విబేధాలు నెలకొన్నట్లు పుకార్లు సృష్టిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తంచేశారు. బీజేపీని ఓడించడం, కర్నాటక ప్రతిష్టను పునరుద్ధరించడం తమ ఇద్దరి ఉమ్మడి లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో తనకు, సిద్ధరామయ్యకు మధ్య ఏకాభిప్రాయం ఉన్నట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. మొత్తం 224 మంది సభ్యులతో కూడిన కర్ణాటక అసెంబ్లీలో తమ పార్టీ 140 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారంలో వాస్తవం లేదని డీకే శివకుమార్ స్పష్టంచేశారు. ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా రెండుసార్లు బీజేపీతో చేతులు కలిపిన జేడీఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సీఎంగా కుమారస్వామి పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. జేడీఎస్‌ను అన్ని విధాలా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. గత ఏడాది జులైలో యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించిన బీజేపీ.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పుకుని ఓట్లు సాధించాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. అయితే ప్రధాని మోదీతో కర్నాటకకు ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

కర్నాటక అసెంబ్లీకి ఒకే విడతలో మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..