Gujarat Election 2022: 1995 నుంచి అధికారం అందని ద్రాక్షే.. రంగంలోకి దిగిన అశోక్ గెహ్లాట్‌.. ఆయనే ఎందుకంటే..?

| Edited By: Team Veegam

Aug 25, 2022 | 4:06 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజులు గుజరాత్ పర్యటన చేపడుతున్నారు.

Gujarat Election 2022: 1995 నుంచి అధికారం అందని ద్రాక్షే.. రంగంలోకి దిగిన అశోక్ గెహ్లాట్‌.. ఆయనే ఎందుకంటే..?
Rajasthan CM Ashok Gahlot (File Photo)
Follow us on

Gujarat Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ గుజరాత్‌‌పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 1995 నుంచి గుజరాత్‌లో అధికారం కాంగ్రెస్ పార్టీకి అందని ద్రాక్షగానే ఉంది. ఈ సారి అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటనకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై సమీక్షించేందుకు గెహ్లాట్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బుధ, గురువారాల్లో ఆయన గుజరాత్‌లో పర్యటిస్తారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఆయన గుజరాత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఒక రోజు ఆలస్యంగా ఆయన రాష్ట్ర పర్యటన మొదలయ్యింది.

గుజరాత్ ఎన్నికలకు సీనియర్ పరిశీలకుడిగా అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ పార్టీ జులై 12న నియమించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా ఆయన పనిచేశారు. అక్కడి తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాలు, బలహీనతలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. గుజరాత్ కాంగ్రెస్ నేతలతోనూ మంచి పరిచయం ఉంది.  గతంలో రాష్ట్రంలో పనిచేసిన అనుభవం ఈ సారి అక్కరకు వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. అందుకే మళ్లీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.

బుధవారంనాడు వడోదర, గురువారంనాడు అహ్మదాబాద్‌లో గెహ్లాట్ పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్లతో అశోక్ గెహ్లాట్ భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. గుజరాత్‌లోని జోన్‌ల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తాల్సిన కీలక అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. అలాగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అంశాలపై కూడా అశోక్ గెహ్లాట్ దృష్టిసారించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

డిసెంబరు‌లో గుజరాత్ ఎన్నికలు..

గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు మాసంలో ఎన్నికలు నిర్వహించనుండగా.. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే విడుదల చేయనుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 77 స్థానాల్లో గెలిచారు. నాటి ఎన్నికల్లో బీజేపీకి 49.1 శాతం ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్ పార్టీకి 41.4 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

అధికార బీజేపీ.. అక్కడ మళ్లీ విజయఢంకా మోగించాలని పట్టుదలగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. ఎంఐఎం, ఎన్సీపీ, భారతీయ ట్రైబల్ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 10 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. భారతీయ ట్రైబల్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఏప్రిల్ 2 నుంచే శ్రీకారంచుట్టింది.

1995 నుంచి ఇప్పటి వరకు గుజరాత్ అసెంబ్లీకి ఆరు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నింటిలోనూ బీజేపీయే విజయం సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 78, బీటీపీ 2, ఎన్సీపీ 1, స్వంతంత్రులు 1 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పడు వరుసగా ఏడోసారి అక్కడ విజయఢంకా మోగించాలని కమలనాధులు పట్టుదలగా ఉన్నారు.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మరిన్ని జాతీయ వార్తలు చదవండి