Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నడ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జనతాదళ్(సెక్యులర్), బీజేపీ వాడివేడిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రాజకీయ రణరంగంలోకి రంగస్థలంలోని స్టార్లు కూడా అడుగు పెట్టేశారు. ఆయా పార్టీల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే..తెలుగు రాష్ట్రాలలో హాస్యబ్రహ్మగా పేరొందిన బ్రహ్మానందం కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చిక్కబళ్లాపుర నియోజకవర్గం(తెలుగు ప్రాంతం)లో బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున ఆయన ప్రచారం చేశారు.
అసలు ఏ పార్టీ తరఫున ఏయే స్టార్ నటీనటులు, హీరోలు ప్రచారం చేస్తున్నారంటే.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీ సీఎం బొమ్మై తరఫున షిమోగాలో ప్రచారం చేస్తున్నారు. అలాగే మరో స్టార్ హీరో దిగంత్, ఇంకా కన్నడ నటీమణలు తారా అనురాధ, హర్షిక పూనాచా, శ్రుతి అధికార బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అలాగే కర్ణాటకలోని పలు తెలుగు ప్రాంతాలలో కమెడియన్ బ్రహ్మానందం కూడా ప్రచారం చేశారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ కూడా బీజేపీ కంటే తగ్గేదేలే అన్నట్లుగా సినిమా స్టార్లను రంగంలోకి దింపింది. మే 10న జరగబోయే ఎన్నికల కోసం శివరాజ్ కుమార్, ఆయన సతీమణి గీతా శివరాజ్ కుమార్, దివ్యస్పందన, దునియా విజయ్ వంటి పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్ కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీ తరఫున సినీ రంగం నుంచి ఆయన కుమారుడు నిఖిల్ గౌడ మాత్రమే ప్రచారం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..