ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు బుధవారం(అక్టోబర్ 23) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ఎదుట నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గత వారం వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికను ఎన్నికల సంఘం ప్రకటించడంతో, క్రియాశీల రాజకీయాల్లో చేరిన ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ప్రియాంక. ఆమె పార్లమెంట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్న కేరళ నియోజకవర్గం నుండి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం కోసం వేదిక సిద్ధమైంది. వాయనాడ్ ఉప ఎన్నికను ఈసీ ప్రకటించిన వెంటనే, కేరళలోని తన అభ్యర్థిగా ప్రియాంక గాంధీ అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని కాంగ్రెస్ వాయనాడ్ నుంచి పోటీకి దింపడంతో, ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు వాయనదింటే ప్రియాంకరి (వయనాడ్‌కు ఇష్టమైనది) అని రాసి ఉన్న పోస్టర్‌లు దర్శనమిచ్చాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన తర్వాత అమేథీని నిలబెట్టుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వాయనాడ్ సీటుకు రాహుల్ రాజీనామా చేయడతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలావుండగా, వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై భారతీయ జనతా పార్టీ నవ్య హరిదాస్‌ను రంగంలోకి దించింది. హరిదాస్ పార్టీ డైనమిక్ లీడర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. నవ్య 2007లో తన బి.టెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. అంతేకాదు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు.
భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 15న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించింది. కేరళలోని 47 అసెంబ్లీ నియోజకవర్గాలు, వయనాడ్ పార్లమెంట్ స్థానానికి మొదటి దశ పోలింగ్ నవంబర్ 13న జరుగుతుంది. రెండో దశ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ అసెంబ్లీ నియోజకవర్గం, మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ స్థానానికి నవంబర్ 20న జరుగుతుంది. ఫలితాలను నవంబర్ 23న ప్రకటిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..