YS Viveka murder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. రెండు రోజుల నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్య విచారణ అనంతరం ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ సందర్భంగా వివేకా వాచ్‌మెన్ సంచలన విషయాలను వెల్లడించారు. దాదాపు రెండున్నర గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు అనంతరం రంగయ్యను జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. వివేకానందరెడ్డిది సుపారి హత్య అని, దీనిలో తొమ్మిది మంది పాత్ర ఉన్నట్లు వెల్లడించారు. తన పేరు వెల్లడిస్తే చంపేస్తానని వివేకానందరెడ్డి అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనను హెచ్చరించినట్టు రంగయ్య పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్, దస్తగిరికి వివేకానందరెడ్డి హత్యతో సంబంధం ఉందని.. వీరి నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు రంగయ్య మెజిస్ట్రేట్‌కు తెలిపిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.
కొంతమందితో ప్రాణహాని ఉన్నట్లు రంగయ్య పేర్కొనడంతో.. రంగయ్య ఇంటి వద్ద పోలీసులు మఫ్టీలో పహారా కాస్తున్నారు. పకడ్బంధీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. రంగయ్యకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు 24గంటల బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వివేకానందరెడ్డి కేసు ప్రస్తుతం కీలక మలుపు తిరిగిన నేపథ్యంలో.. పేర్లు వెల్లడించిన తొమ్మిది మందితోపాటు మరికొంతమంది కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. వివేకా మృతి కేసు గత నెలన్నర రోజులుగా ఊపందుకుంది. కేసు విచారణలో భాగంగా.. సీబీఐ అధికారులు కడపలోనే ఉంటూ అనుమానితులను విచారిస్తూ స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు.
Also Read: