Gold Robbery: నమ్మిన వారి గొంతు కోయడం అంటే ఇదే. బంగారం షాపులో నమ్మకంగా పనిచేస్తున్న ఓ గుమస్తా తన యజమానిని మోసగించి సుమారు ఐదు కోట్ల రూపాయల బంగారంతో పరారీ అయ్యాడు. విజయవాడ గవర్నర్ పేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గవర్నర్ పేట జైహింద్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో మహావీర్ జైన్ అనే వ్యక్తి రాహుల్ జ్యువెలరీ నడుపుతున్నాడు. అతను అదే కాంప్లెక్స్ లో ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. దుకాణంలో విలువైన..ప్రత్యేకమైన నగలు తన ఇంటిలో ఉంచుతాడు. కస్టమర్లు వచ్చినపుడు వాటిని కిందికి తెచ్చు చూపించి మళ్ళీ ఇంటిలో పెట్టేస్తాడు. ఈయన దగ్గర రవితేజ, హర్ష అనే ఇద్దరు గుమస్తాలు పనిచేస్తున్నారు. ఎప్పుడైనా కష్టమర్లు వచ్చినపుడు వాళ్ళే పై నుంచి బంగారం కిందికి తెచ్చి ఇస్తుంటారు. మొన్న ఉదయం ఆభరణాలు తేవడానికి వారిని తన ఇంటికి పంపాడు. అప్పుడు ఆయన భార్య, కుమారుడు రెండు బాగుల్లో ఆభరణాలు వారికీ ఇచ్చి పంపించారు. కొద్ది సేపటి తరువాత మళ్ళీ ఆ బాగ్ లు రవితేజ, హర్ష యజమాని ఇంట్లో ఉదయం 11 గంటల సమయంలో అప్పగించేశారు.
మహావీర్ సోదరుడు ఇటీవల కోవిడ్ బారిన పడి స్థానికంగా ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అతన్ని చూసి వచ్చేందుకు మహావీర్ 11.30 గంటల సమయంలో షాపు నుంచి ఆస్పత్రికి వెళ్లాడు. అదే అదనుగా భావించిన గుమస్తా హర్ష 12.30 గంటల సమయంలో యజమాని ఇంటికి వెళ్లి ఆభరణాలు అడిగాడు. ఎప్పటిలాగే కొనుగోలుదారులకు చూపడానికే అనుకుని మహవీర్ భార్య, అతని కుమారుడు తిరిగి రెండు బ్యాగుల్లో ఉన్న ఆభరణాలను హర్ష చేతికి అందజేశారు. రెండు బ్యాగులతో కిందకు వచ్చిన హర్ష దుకాణానికి వెళ్లకుండా వాటితో ఉడాయించాడు.
ఆస్పత్రికి వెళ్లిన మహవీర్ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. బుధవారం యథావిధిగా దుకాణం తెరిచి ఆభరణాల కోసం ఆరా తీయగా.. అసలు విషయం బయట పడింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారం దుకాణంలో ఏడాది కాలంగా పనిచేస్తున్న హర్ష విజయవాడకు చెందినవాడేనని పోలీసులు గుర్తించారు. ఆభరణాలు అపహరించే ముందు హర్ష తనకు సంబంధించిన ఆధారాలు దుకాణంలో లేకుండా జాగ్రత్త పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన విషయం తెలిసిన వెంటనే నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.
Also Read: Crime: విజయవాడలో ఘోరం.. తల్లీ, ఇద్దరు పిల్లల హత్య..! భర్తపై అనుమానం..