Oxygen Concentrator Explodes: కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా చాలామంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమయంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల వినియోగం బాగా పెరిగిపోయంది. ఈ క్రమంలో మార్కెట్‌లో నాసిరకంగా లభించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కోవిడ్ బాధితుల ప్రాణాలకే ముప్పుగా మారింది. ఓ ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పేలి భార్య మృతి చెందగా, భర్త ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాజస్తాన్ గంగాపూర్ లోని ఉదయ్ మోర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
సుల్తాన్ సింగ్, సంతోషి మీనా దంపతులు ఉదయ్ మోర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సుల్తాన్ కోవిడ్ బారిన పడ్డాడు. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో.. రెండు నెలలుగా ఇంట్లోనే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నాడు. అయితే.. టీచర్‌గా పనిచేస్తున్న సుల్తాన్ సింగ్ భార్య మీనా శనివారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి లైట్లు ఆన్ చేసింది. ఈ క్రమంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పెద్ద శబ్దంతో పేలి మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో సంతోషి మీనా అక్కడికక్కడే మృతి చెందింది. ప్రాణాపాయ స్థితితో ఉన్న సుల్తాన్ సింగ్‌ను స్థానికులు జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగాపూర్ పోలీసులు తెలిపారు. కాగా.. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ చైనాలో తయారైనట్లు షాపు యజమాని తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: