చేతిలో అధికారం..ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారం..అయితే, గర్తుంచుకోవాల్సిందేంటంటే, చేస్తున్నది అల్లాటప్పా పోస్ట్ కాదది. రాష్ట్రంలో అత్యంత ఉన్నత పదవి. ప్రజలను రక్షించడం, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పోస్ట్ అది. కానీ రక్షించాల్సిన ఆయనే భక్షకులుగా మారారు. తానేం చేస్తున్నానన్న విచక్షణ మరిచి ప్రవర్తించారు. పైగా ఆయన వేధింపులకు గురి చేసింది కూడా అత్యంత ఉన్నత స్థాయి అధికారిణినే. రెండు పదవులూ సమానమే. సాక్షాత్తూ ఓ మహిళా ఐపీఎస్ అధికారిణిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తమిళనాడు డీజీపీ.
అసెంబ్లీ ఎన్నికల వేళ డీజీపీ వ్యవహారంపై తమిళ రాజకీయాల్లో రచ్చ జరుగుతోంది. ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి డీజీపీ లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. సీఎం పళని స్వామి పర్యటన సందర్భంగా సెక్యూరిటీ విధులు నిర్వహించేందుకు వెళ్తున్న సమయంలో కారులో తన పట్ల అసభ్యకంగా ప్రవర్తించారని మహిళా ఐపీఎస్ అధికారిణి.. రాష్ట్ర డీజీపీ రాజేష్ దాస్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. దర్యాప్తు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం డీజీపీని బదిలీ చేసి వెయిట్ లిస్ట్‌లో ఉంచింది తమిళనాడు ప్రభుత్వం.
డీజీపీపై వస్తున్న లైంగిక ఆరోపణలపై డీఎంకే తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మహిళా అధికారిపై సాక్షాత్తు ఉన్నత అధికారే లైంగిక వేధింపులకు పాల్పడితే.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని స్టాలిన్, కనిమొళి మండిపడుతున్నారు. అలాంటి అధికారులను పళనిస్వామి ప్రభుత్వం వెనకేసుకు వస్తోందని విరుచుకపడ్డారు. అలాంటి ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడాలని అని విమర్శలు గుప్పిస్తున్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో ఈ ఘటన వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమయింది. డీజీపీ అంశాన్ని హైలైట్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది. ఐతే ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ రాజేష్ దాస్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు ఇవాళ తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రధాని పర్యటన బందోబస్తు విధులకు డీజీపీని దూరంగా ఉంచి ఎంక్వైరీకి ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.
Read also :