మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా బ్యాంకులో క్యాష్ విత్ డ్రా చేస్తున్న మహిళను బురిడీ కొట్టించి సొమ్ముతో ఉడాయించారు దుండుగులు. తాజాగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకులో డబ్బుల చోరీకి పాల్పడ్డారు దుండగులు. మాటల్లో పెట్టి సొమ్ముతో ఉడాయించారు.
వికారాబాద్ ప్రాంతానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన బంగారాన్ని కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టింది. ఇందుకు గానూ రూ.93,000 అప్పు తీసుకున్నారు. తీసుకున్న డబ్బులను బ్యాంకులోనే లెక్కిస్తుండగా గుర్తు తెలియని దుండగులు గమనించారు. మాటల్లో పెట్టి దగ్గరికొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. బ్యాంకులో డబ్బులు ఇచ్చే వారు దొంగ నోట్లు ఇస్తున్నారని మహిళను నమ్మబలికారు. నకిలీ నోట్లు ఉన్నాయని, వచ్చిన వాటిలో అలాంటివి చూద్దామంటూ మహిళ దగ్గర కూర్చున్న యువకులు.. నోట్లను లెక్కించే క్రమంలో మీన వేషాలు వేశారు. కేటుగాళ్ళ మాటలు నిజమని నమ్మిన మహిళ.. బ్యాంకులో నుంచి తీసుకున్న డబ్బులు లెక్కిస్తున్నట్లు నటించి డబ్బులు కాజేశారు దుండగులు.
దొంగ నోట్లను పరిశీలిస్తామంటూ మహిళ వద్ద డబ్బులు తీసుకుని చాకచక్యంగా అక్కడి నుంచి ఉడాయించారు. సదరు మహిళ కన్నుగప్పి రూ. 29,500 కాజేశారు. ఇది గమనించని మహిళ ఇంటికెళ్ళి లెక్కించగా, రూ.29,500 తక్కువగా వచ్చినట్లు గుర్తించింది. దీంతో లబోదిబోమంటూ తిరిగి బ్యాంక్ వచ్చింది మహిళ. అయితే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు బ్యాంక్ సిబ్బంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ సీఐ నాగరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్త కొత్త ఆలోచనలతో అమాయకులే టార్గెట్ చేస్తున్న ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…