Police Over Action: ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా?.. ఐస్‌క్రీమ్ వెండర్‌పై లాఠీతో పోలీస్ జులుం.. వీడియో వైరల్‌తో నెటిజన్ల ఫైర్!

ఓవైపు పోలీస్ ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పదే పదే చెబుతున్నారు. ప్రజలతో స్నేహంగా మెలగాలని.. దురుసుగా ఉండొద్దని సిబ్బందికి సూచిస్తున్నారు. ఎంత చెప్పినప్పటికీ కొందరి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు.

Police Over Action: ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా?.. ఐస్‌క్రీమ్ వెండర్‌పై లాఠీతో పోలీస్ జులుం.. వీడియో వైరల్‌తో నెటిజన్ల ఫైర్!
Police Over Behaviour With Ice Cream Vendor

Updated on: Nov 01, 2021 | 12:56 PM

Police Over Action: ఓవైపు పోలీస్ ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పదే పదే చెబుతున్నారు. ప్రజలతో స్నేహంగా మెలగాలని.. దురుసుగా ఉండొద్దని సిబ్బందికి సూచిస్తున్నారు. ఎంత చెప్పినప్పటికీ కొందరి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఇలా దురుసుగా వ్యవహరించే పోలీసుల తీరు.. మిగతా పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. తాజాగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు మచ్చ తెచ్చిపెట్టింది.

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పొట్టకూటి కోసం నిజాయితీగా బతకడానికి పడరానిపాట్లుపడుతున్న వారిపై పోలీసుల దాష్టీకాన్ని ఆయన ఖండించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో మానవత్వం మరచి విచక్షణారహితంగా ప్రవర్తించడంపట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ వేదికగా విజయవాడ పోలీసుల తీరును ఎండగట్టారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ మీద ఆదివారం రోజు రాత్రి జరిగిన సంఘటనపై విష్ణువర్ధన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.పొట్టకూటి కోసం నిజాయితీగా బతకడానికి పడరానిపాట్లుపడుతున్న వీరిపై , నిబంధనల పేరుతో పోలీసు జులుం ,లాఠీలతో దాడులు ఎంటని పేర్కొన్నారు. ప్రజలకు పోలీసుల మీద గౌరవం పెరగాలంటే దారుణానికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోండి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.


ఇదిలావుంటే, విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ఐస్ క్రీమ్ అమ్ముతున్న యువకుణ్ని ఓ కానిస్టేబుల్ లాఠీతో చితకబాదాడు. ఆ యువకుడు సారీ సార్.. సారీ సార్.. అని వేడుకుంటున్నా.. లాఠీ దెబ్బలు రుచి చూపించాడు. ప్రకాశం బ్యారేజీపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జనం ఎక్కువగా వచ్చే ప్రాంతాలకు చిరు వ్యాపారులు వెళ్లి.. తినుబండారాలు విక్రయించడం సర్వసాధారణం. ముఖ్యంగా నగరాల్లో వీకెండ్స్‌లో సాయంత్రం మొదలు అర్ధరాత్రి వరకు ఇలా విక్రయిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటారు. అలాంటి చిరు వ్యాపారులపై పోలీసులు ప్రతాపం చూపడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. పొట్టకూటి కోసం ఐస్ క్రీమ్‌లు అమ్ముకుంటున్న యువకుడిపై పోలీస్ ఇలా ప్రతాపం చూపడం పట్ల నెటిజన్లు మండి పడుతున్నారు.


బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, భూ కబ్జాలకు పాల్పడే వారు.. రౌడీలు, గుండాల జోలికి వెళ్లడానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పోలీసులు.. ఇలాంటి బడుగు జీవులపై లాఠీ ఝులిపించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడాబాబుల జోలికి వెళ్లే సాహసం ఎలాగో చేయలేరు.. ఇలాంటి అభాగ్యుల మీదే కదా మీ పోలీసుల ప్రతాపం అంటూ కొందరు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరు జీవులపై ప్రతాపం చూపే.. ఇలాంటి పోలీసు సిబ్బందిని శిక్షించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై విజయవాడ పోలీసు కమిషనర్ శ్రీనివాసులు విచారణకు ఆదేశించారు.

Read Also…. Viral Video: ఈ జంతువులను చూసి మనుషులు సిగ్గుపడాల్సిందే.. ఎందుకో మీరే చూడండి..