Vigilance Raids in AP : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై పలు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో రోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే అదనుగా భావించి తీవ్రంగా ఉన్న పేషెంట్ల బంధువల దగ్గరి నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. కొవిడ్ టీకాలు కావాలంటూ కంగారు పెట్టించి బ్లాక్‌లో వారే అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కవ కావడంతో విజిలెన్స్ అధికారులు రైడ్స్ ప్రారంభించారు.
ఏలూరు చైత్ర హస్పటల్ లో అనుమతి లేకుండా కరోనా వైద్యం , అధిక ధరల వసూలు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పేషంట్ల విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడంతో క్రిమినల్ కేసు నమోదు చేశారు. గుంటూరు విశ్వాస్ హాస్పిటల్ పై ఆరోగ్య శ్రీ వైద్యం అందించడం లేదని పేషెంట్లు ఆరోపించడంతో తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలు వసూళ్లు చేస్తున్నారని నిరూపణ కావడంతో కేసు నమోదు చేశారు. అలాగే పీలేరు ప్రసాద్ హాస్పిటల్ పై కూడా కేసు నమోదు చేశారు.
వైజాగ్ ఎస్ఆర్ హాస్పటల్, రమ్య హాస్పిటల్ లో అధిక ధరలు వసూలు చేయడం, రెమిడిస్విర్ దుర్వినియోగం జరిగినట్టు గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యంపై పలు కేసులు నమోదు చేశారు. విజయవాడ శ్రీరామ్ హాస్పిటల్ లో అనుమతి లేకుండా కరోనా వైద్యం చేస్తూ అధిక ధరలు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించిన విజిలెన్స్ అధికారులు.. వైద్యం జరుగుతున్న ప్రదేశం అచ్యుతా ఎన్క్లేవ్ పై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37 ప్రైవేటు హాస్పటల్స్ పై అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.