Hyderabad Crime : అతడి కన్ను పడిందంటే ఆ ఇల్లు లూటీ కావాల్సిందే.. సెంచరీ దాటినా చోరీలు ఆపడం లేదు. 22 సార్లు జైలుకు వెళ్లొచ్చినా బుద్ధి మారడం లేదు. 30 ఏళ్లుగా నేరాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు 160 చోరీలు చేశాడు. అనుకోకుండా ఓ చోరీ కేసులో హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులకు చిక్కాడు. దీంతో నేర చరిత్ర మొత్తం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్‌శెట్టి ఫలకునుమా, నవాబ్ సాహెబ్ కుంటకు చెందిన వాడు. మధ్య తరగతి కుటుంబాలనే లక్ష్యంగా చేసుకొని ఆయా ఇండ్లలో దొంగతనాలు చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. 2018లో కంచన్‌బాగ్ పోలీసులు ఇతనిపై పీడీయాక్టు ప్రయోగించారు. 2021 మార్చి నెలలో జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత 12 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు.
సీసీ కెమెరాలు ఎక్కువగా అమర్చడంతో పోలీసులు గుర్తిస్తారని భావించాడు. అందుకే జైలు నుంచి విడుదలైన తర్వాత సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడడం ప్రారంభించాడు. అయితే విశ్వసనీ సమాచారంతో సౌత్‌జోన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 36.5 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.