Andhra-Odisha Border : ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 24 మంది జవాన్లు మృతి చెందారు. అంతేకాకుండా వారి దగ్గరి నుంచి ఏకంగా రెండు డజన్ల ఆయుధాలను తస్కరించారు. మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిద్మా నాయకత్వంలో ఈ దాడి జరిగింది. మందుపాతర పేల్చి.. ఆ తర్వాత పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి చెందారు.
ఇదిలా ఉంటే ఈ ఘటన నేపథ్యలో.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రాలోకి ప్రవేశించడానికి అవకాశం ఉన్నందున ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. దండకారణ్యం నుంచి ఎలాంటి చొరబాట్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా విశాఖ జిల్లా పోలీసులు గస్తీ చేపట్టారు. బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం జిల్లా సరిహద్దు నుంచి సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది.
ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో… మావోయిస్టులు జిల్లా సరిహద్దులు దాటి రాకుండా నిరోధించేందుకు ఒడిశా సరిహద్దు ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపించినట్లు సమాచారం. జవాన్లపై దాడికి పాల్పడిన మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకుని ఒడిశాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికలతో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీలేరు తనిఖీ కేంద్రం వద్ద, ఐస్‌గెడ్డ వద్ద బలగాలను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు.