వారంతా పెద్దగా చదువుకున్న బ్యాచ్ కాదు. టెక్నికల్ నాలెడ్జ్ అస్సలు లేదు. కానీ జనాల్ని ఈజీగా చీట్ చేస్తున్నారు. సైబర్ నేరాలతో పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఏ మాత్రం నాలెడ్జ్ లేని.. వీరు చదువుకున్నవారిని కూడా ఎలా మోసం చేస్తున్నారు..?. ఈ ప్రశ్న పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. దీంతో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఝార్ఖండ్ దేవగఢ్ జిల్లాలోని పలు పట్టణాల్లో సైబర్ నేరాలు ఎలా చెయ్యాలో నేర్పేందుకు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. జనాల్ని ఎలా ట్రాప్ చెయ్యాలి.. బ్యాంక్ అధికారులను ఎలా నమ్మించాలి? భాష తెలియకపోయినా ఎలా మ్యానేజ్ చెయ్యాలి..? ఉత్తుత్తి ఇంటర్వ్యూలు ఎలా నిర్వహించాలి? తదితర అంశాలపై ఆయా సెంటర్లలో కోచింగ్ ఇస్తున్నారు. 16 కేసుల్లో నిందితులుగా ఉన్న పది మంది దేవగఢ్ ముఠా సభ్యులను రాచకొండ సైబర్‌క్రైమ్స్ దర్యాప్తు బృందం సోమవారం నగరానికి తీసుకు వచ్చి రిమాండ్‌కు తరలించింది. వారి ఇన్వెస్టిగేషన్‌లో ఈ విషయాలు వెలుగుచూశాయి.
దేవగఢ్ జిల్లాలోని అనేక గ్రామాల్లో దాదాపుగా ఇంటికో సైబర్ చీటర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పశ్చిమబెంగాల్ నుంచి ఎలాంటి ఐడెంటిటీ ప్రూప్స్ లేకుండా ఒకేసారి 500 సిమ్ కార్డులు తెచ్చుకుంటున్నారు. ఒకరిని మోసం చేయగానే.. ఆ సిమ్ కార్డును పక్కన పారేస్తున్నారు. అయితే వీరిలో చాలామంది ఓ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా పనిచేస్తుండటం కొసమెరుపు. గత అనుభవాలను బట్టి అక్కడి పోలీసులు నిందితులకు సహకరిస్తున్నట్లు మనవాళ్లు నిర్ధారించికున్నారు. వారికి సమాచారం ఇస్తే.. ఫలితం లేకపోవడంతో మనవాళ్లే డైరెక్ట్‌గా రంగంలోకి దిగుతున్నారు. ఒక్కో గ్యాంగ్‌లో నలుగురు సభ్యులు ఉంటారు. ఇద్దరు కంప్యూటర్లను ఆపరేట్ చేస్తుంటే.. మరో ఇద్దరు ఫోన్ల ద్వారా అమాయకులను ట్రాప్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వీరి వద్ద హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రెడీ చేసిన స్క్రిప్ట్‌లు ఉంటాయి. కస్టమర్ కేర్, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, ఏటీఎం బ్లాక్.. వంటి అంశాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఇస్తున్నారు. అక్కడ ఉన్న స్క్రిప్ట్‌కు ఒక్క మాట కూడా ఎక్స్ ట్రా మాట్లాడరు. ఇక్కడ మీ మైండ్ బ్లాంక్ అయ్యే విషయం మరొకటి ఉంది. మొదటి దోచుకున్న సొత్తును గురుదక్షిణగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు అందజేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు కంగుతిన్నారు.
Also Read: 2 నెలల క్రితం రోడ్లపై కుప్పలు.. ఇప్పుడేమో కొందామంటే వాతలు.. తాజా ధర తెలిస్తే షాకే