లంచం ఇవ్వలేదని చిరు వ్యాపారిపై గంజాయి కేసు.. నలుగురు పోలీసులు సస్పెన్షన్..ఎక్కడంటే?

|

Jul 23, 2021 | 6:03 PM

Telugu Crime News: పోలీసు వ్యవస్థకు తలవంపు తీసుకొచ్చారు బెంగుళూరుకు చెందిన ఆ నలుగురు ఖాకీలు. లంచం ఇవ్వలేదన్న అక్కసుతో చిరు వ్యాపారిని గంజాయి కేసులో ఇరికించి వేధింపులకు గురిచేశారు.

లంచం ఇవ్వలేదని చిరు వ్యాపారిపై గంజాయి కేసు.. నలుగురు పోలీసులు సస్పెన్షన్..ఎక్కడంటే?
Parvathamma and Anjinappa
Follow us on

పోలీసు వ్యవస్థకు తలవంపు తీసుకొచ్చారు బెంగుళూరుకు చెందిన ఆ నలుగురు ఖాకీలు. లంచం ఇవ్వలేదన్న అక్కసుతో చిరు వ్యాపారిని గంజాయి కేసులో ఇరికించి అరెస్టు చేశారు. అవమాన భారంతో ఆ చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు కారణమయ్యారు. లంచగొండితనంతో తాము వేసుకున్న ఖాకీ యూనిఫాంకు తలవంపు తీసుకొచ్చిన ఆ నలుగురు పోలీసులు సస్పెండ్‌కు గురైయ్యారు. సస్పెండ్‌కు గురైన వారిలో ఓ మహిళా పోలీస్ ఇనిస్పెక్టర్ కూడా ఉన్నారు. విషయంలోకి వెళ్తే… బెంగుళూరులో తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ శివరాజ్(45) జీవనం సాగిస్తున్నాడు. తోపుడు బండిపై వ్యాపారం చేసుకునేందుకు గతంలో ఆయన పోలీసులకు లంచం ఇచ్చేవారు. అయితే లాక్‌డౌన్ కారణంగా సరిగ్గా వ్యాపారం లేకపోవడంతో.. పోలీసులకు మునుపటిలా లంచం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.

లంచం ఇవ్వనందున శివరాజ్‌ను అక్రమ కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. ఓ పథకం ప్రకారం గంజాయి నింపిన సిగరెట్‌ను ఆయన చేత తాగించారు. వైద్య పరీక్షలు చేయించి, ఆయన నిషేధిత గంజాయి తాగినట్లు నిర్థారించే రిపోర్టులతో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. జులై 17న బెయిల్‌పై విడుదలైన శివరాజ్(45)..గంజాయి కేసుతో తీవ్ర మనస్థాపంతో పరుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు తగిన సమయంలో ఆస్పత్రికి తరలించడంతో అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. తమకు జరిగిన అన్యాయంపై ఆయన కుటుంబీకులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో నిందితుడైన సబ్ ఇనిస్పెక్టర్ అంజినప్ప… విచారణాధికారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ధర్మేంద్ర కుమార్ మీనాను స్టింగ్ ఆపరేషన్‌లో ఇరికించి తమకు అనుకూలంగా నివేధిక ఇప్పించుకునేలా ప్రయత్నించాడు. తనపై స్టింగ్ ఆపరేషన్ చేయిస్తున్న అంజినప్పను డీసీపీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

డీసీపీ అధికారి నిర్వహించిన అంతర్గత విచారణలో లంచం ఇవ్వలేదన్న అక్కసుతో చిరు వ్యాపారి శివరాజ్‌పై గంజాయి కేసు పెట్టి వేధించినట్లు నిర్థారించారు. ఆ మేరకు డీసీపీ తన ఉన్నతాధికారులకు విచారణ నివేదికను సమర్పించారు. పోలీసు వ్యవస్థకు తలవంపులు తీసుకొచ్చిన నలుగురు పోలీసు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సస్పెన్షన్‌కు గురైన వారిలో ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ ఇనిస్పెక్టర్ పార్వతమ్మ, సబ్ ఇనిస్పెక్టర్ అంజినప్ప సహా మరో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. తప్పు చేసిన ఖాకీలపై చర్యలు తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులను బెంగుళూరు నగర ప్రజలు మెచ్చుకుంటున్నారు.

Also Read..

PM Kusum: రైతులకు మరో గొప్ప అవకాశం.. వ్యవసాయ క్షేత్రంలోనే బిజినెస్.. ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం..

AP Land Survey: ఏపీలో భూముల రీ సర్వేకు సంబంధించి కీలక అప్‌డేట్.. రంగంలోకి డ్రోన్స్, రోవర్స్