Municipal Commissioner Suspension: విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేదీ లేదన్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మున్సిపల్ కమిషనర్‌పై వేటు వేసింది. టీఎస్ బీపాస్ నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మాణానికి మాన్యువల్‌గా అనుమతులిచ్చిన తుర్కయంజాల్ మునిసిపాలిటీ కమిషనర్ హైమద్ షఫీ ఉల్లాను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమ్మగూడ 18వ వార్డులో సీలింగ్ ల్యాండ్ సర్వేనంబర్ 253, 254/ఏలోని ప్లాటు నంబర్ 18 లో గల 299 గజాలకు స్టిల్ట్ ప్లస్ 3 భవన నిర్మాణ కోసం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకుగానూ రూ.2,00,986 ప్రభుత్వానికి చెల్లించారు. అదనపు అంతస్తు కోసం బిల్డర్ కమిషనర్‌ను కలవడంతో నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ మాన్యువల్‌గా నాలుగో అంతస్తుకు అనుమతులు జారీ చేశారు. దీనిపై స్థానిక కౌన్సిలర్‌తో పాటు మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు, గత నెల 27వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయగా, కమిషనర్ తన సంజాయిషీని కలెక్టర్‌కు సమర్పించారు. దీనిపై అసంతృప్తి చెందని కలెక్టర్ శుక్రవారం కమిషనర్‌ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే పద్ధతిలో అక్రమ కట్టడాల నిర్మాణలపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.