పాలసీలు చేయిస్తారు.. ప్రాణాలు తీసేస్తారు.. కరడుగట్టిన హంతకులు.. సంచలన నిజాలు

అదొక భయంకరమైన ముఠా. ప్రైవేటు బీమా ఏజెంట్లు.. కరడుగట్టిన హంతకులు..ఇందులో సభ్యులు. వారికి కొందరు బ్యాంకు సిబ్బంది కూడా జత కలిశారు.

పాలసీలు చేయిస్తారు.. ప్రాణాలు తీసేస్తారు.. కరడుగట్టిన హంతకులు.. సంచలన నిజాలు
పాలసీలు చేయించి.. చంపేస్తున్నారు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 03, 2021 | 10:42 AM

Nalgonda District:  అదొక భయంకరమైన ముఠా. ప్రైవేటు బీమా ఏజెంట్లు.. కరడుగట్టిన హంతకులు..ఇందులో సభ్యులు. వారికి కొందరు బ్యాంకు సిబ్బంది కూడా జత కలిశారు. అంతా కలిసి డబ్బు కోసం కిరాతక కార్యాలకు తెగబడ్డారు. గత మూడేళ్లలో ఏకంగా ఐదారుగురిని దారుణంగా హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరించి కోట్ల రూపాయల బీమా సొమ్మును స్వాహా చేసింది ఆ ముఠా.

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తండా కు చెందిన ప్రైవేటు బీమా ఏజెంట్.. ఈజీ మనీ కోసం పథకం వేశాడు. ఇందుకోసం కొంతమందితో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. ఈ ముఠాలో ప్రైవేటు బీమా ఏజెంట్ తో పాటు కిరాయి హంతకులు కూడా సభ్యులుగా ఉన్నారు. సినిమా తరహాలో పక్కా పథకం ప్రకారం హత్య చేసి బీమా సొమ్మును స్వాహా చేస్తోంది ఈ ముఠా.

ఈ ముఠా సభ్యులు ముందుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి పేరుతో లక్షల రూపాయలకు బీమా చేస్తారు. ఒకట్రెండు కిస్తీలు తామే కట్టేస్తారు. కుటుంబ సభ్యుల (నామినీ)తో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత వీళ్ల ముఠాలోని కొందరు అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని హత్య చేసి.. రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఏ కారుతోనో ఢీకొట్టించి.. ప్రమాదంలో మృతిచెందినట్లుగా చిత్రీకరిస్తారు. పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్‌ తీసుకుంటారు. దాని సాయంతో బీమా పాలసీని క్లెయిమ్‌ చేసుకుంటారు. విచారణకు వచ్చిన థర్డ్‌ పార్టీ సభ్యులను, డబ్బుల పంపిణీలో బ్యాంక్‌ సిబ్బందిని కూడా ‘మేనేజ్‌’ చేస్తారు. వచ్చిన మొత్తంలో 20 శాతం నామినీకి ఇచ్చి మిగతా మొత్తాన్ని తలా కొంత పంచుకుంటారు.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి వారం  రోజుల క్రితం అనుమానాస్పదంగా నార్కట్‌పల్లి – అద్దంకి రహదారి పక్కన మృతి చెందారు. ఆయన ట్రాక్టర్‌ ఢీకొని చనిపోయాడని భార్య, కుటుంబ సభ్యులను సదరు ముఠా నమ్మించింది. అంత్యక్రియల సమయంలో మృతదేహంపై ఉన్న పెద్దపెద్ద గాయాలను చూసి కోటిరెడ్డి తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కోటిరెడ్డి భార్యను గట్టిగా విచారించగా.. పక్క గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి బీమా డబ్బుల కోసం భర్తను హత్య చేసి ట్రాక్టర్‌తో తొక్కించామని నిజం అంగీకరించినట్లుగా కోటిరెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కోటి రెడ్డి హత్య కేసులో నిందితులైన అతని భార్యతో పాటు ఇద్దరు ప్రైవేట్ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా బీమాసురుల డొంక కదిలింది. మొత్తం అరాచకాలు బయటపడ్డాయి. మూడేళ్లుగా ఇదే తరహాలో సదరు ఏజెంటు ముఠా ఐదారుగురి ప్రాణాలు తీసి ప్రమాదంగా చిత్రీకరించి బీమా డబ్బులు స్వాహా చేసినట్లు తెలిసింది.

దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్‌ కోసం గాలిస్తున్నారు. వీరి ఆగడాలను విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక, ఈ దురాగతం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

రూ. 500కే కొత్త ఎల్ఈడీ టీవీ టీవీ.. ఆరా తీస్తే దిమ్మ తిరిగే షాక్‌.. పోలీసులే కంగుతిన్నారు