డబ్బు పిచ్చితో కొందరు యూట్యూబర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. తమను అడిగేవాళ్లే లేరన్నట్లు ‘వ్యూస్’ కక్కుర్తితో అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఓ రకంగా ఈజీ మనీ కోసం యూట్యూబ్‌ను అడ్డంగా వాడేసుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన పాపులర్ యూట్యూబర్ ‘టాక్సిక్’ మదన్ కూడా ఇదే పంధాను ఎంచుకున్నాడు. అశ్లీలత, మహిళలను కించపరిచేలా కామెంట్స్ చేసి, ఆ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో వచ్చే సంపాదనతో పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టుకున్నాడు..లగ్జరీ కార్లు కొనగోలు చేశాడు..చివరకు అతని పాపం పండి జైల్లో చిప్పకూడు తింటున్నాడు.
తన పేరిట పలు యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తున్న మదన్‌కు పబ్‌జీ ప్లేయర్, లైవ్ స్ట్రీమర్‌గానూ మంచి గుర్తింపు ఉంది. మహిళలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసి..ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవాడు. ఈ వీడియోల్లో మహిళలను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. మహిళలనుద్దేశించి మదన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తంకావడంతో ఆయన్ను గత నెల 18న చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ ప్రకటించారు. గత నెల ఆయన భార్య కృతికను కూడా అరెస్టు చేసి విచారణ అనంతరం తమ కస్టడీ నుంచి విడిచిపెట్టారు. తన యూట్యూబ్ వీడియోలకు ఎక్కువ వ్యూస్ సాధించేందుకు తన భార్యతో మదన్ అశ్లీలంగా మాట్లాడించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
లగ్జరీ కార్లు లేవు..ఆడీ మాత్రమే ఉంది..
టాక్సిక్ మదన్ తన పేరిట పలు యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తూ… వీటి ద్వారా ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్నట్లు సమాచారం. యూట్యూబ్ ఛానళ్ల ద్వారా వచ్చే ఆదాయంతో పలు ఆస్తులను కూడబెట్టుకున్నట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి.అలాగే లగ్జరీ కార్లు కూడా కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన భార్య…తమకు ‘ఆడి ఏ6’ కారు మాత్రమే ఉందని, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు లగ్జరీ కార్లేవీ లేవని చెప్పుకొచ్చింది. యూబ్యూట్ ద్వారా వస్తున్న ఆదాయంతో మాత్రమే కుటుంబాన్ని పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తమ యూట్యూబ్ ఛానళ్ల నుంచి వస్తున్న ఆదాయం జమ అవుతున్న బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేయడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అలాగే తమ యూట్యూబ్ ఛానళ్లను మూసేయడంతో కుటుంబ పోషణకు అవసరమైన ఆదాయాన్ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు. అలాగే తన భర్త మదన్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం సరికాదని కృతిక పేర్కొన్నారు. తాము ఎవరినీ మోసగించలేదని, ఇప్పటి వరకు తాము డబ్బులు మోసగించినట్లు ఎవరూ పోలీసులను ఆశ్రయించలేదన్నారు.
ఈజీ మనీ కోసమే యూట్యూబ్‌లో ఆ తరహా పోస్ట్‌లు
ఈజీ మనీ కోసమే మదన్, ఆయన భార్య యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో తేలింది. తమ యూట్యూబ్‌లో వీడియోలకు ఎక్కువ వ్యూస్ సాధించేందుకు ఉద్దేశపూర్వకంగానే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగ్స్ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. అతని యూట్యూబ్ ఛానళ్లకు ఎక్కువగా టీనేజ్ సబ్‌స్కైబర్లే ఎక్కువగా ఉన్నారు. అతను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ 150 కేసులు నమోదయ్యాయి. అయితే కాస్త ఆలస్యంగానైనా మదన్ పాపం పండిందంటూ మహిళా సంఘాలు అతని అరెస్టుపై హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
యూట్యూబ్‌లో హద్దులో దాటితే..
సైబర్ క్రైమ్ పోలీసుల సిఫార్సు మేరకే యూట్యూబర్ మదన్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ ఆదేశించారు. యూట్యూబ్‌లో హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మహిళలను కించపరచడంతో పాటు జాతి వైషమ్యాలు సృష్టించేలా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పస్టంచేశారు.
Also Read..
నాలుగు నెలల వేట ఫలితం దక్కింది.. నాడు తప్పించుకున్నాడు.. నేడు అడ్డంగా దొరికిపోయాడు..
మరోసారి ఉలిక్కి పడ్డ నిజామాబాద్ జిల్లా.. సౌదీలో ఐసిస్‌తో సంబంధాలు.. బోధన్‌లో వ్యక్తి అరెస్ట్..