
బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాల్లో బలాదూర్ తిరిగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 5న మధ్యాహ్నం 2:00 గంటలకు విజయ్ మాల్యాను తమ ముందు హాజరుపర్చాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి, తన ఆస్తులను పిల్లలకు బదిలీచేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, అంతకు ముందు కోర్టు ధిక్కారం కేసులు దోషిగా తేలిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి.. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విజయ్ మాల్యా బదిలీ చేసినట్టు రుజువు అయ్యింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణం తీసుకుని, ఎగవేసిన విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న విషయం విదితమే.
Supreme Court directs fugitive businessman Vijay Mallya to be present in person before it on October 5 at 2 pm and directs Ministry of Home Affairs to ensure his presence in the courtroom on that day. pic.twitter.com/SEAzkoiJZb
— ANI (@ANI) August 31, 2020
కాగా, 2016 నుంచి బ్రిటన్‌లో ఉన్న విజయ్ మాల్యాకు స్కాట్‌లాండ్ యార్డు కోర్టు 2017 ఏప్రిల్ 18న బెయిల్ మంజూరు చేసింది. నాటి నుంచి అక్కడే ఉన్న ఆయనను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ మాల్యాకు ఆశ్రయం కల్పించవద్దని కేంద్ర విదేశాంగశాఖ జూన్ 11న బ్రిటన్‌ను కోరింది. మరోవైపు, విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ సర్కార్ కూడా చర్యలు చేపట్టింది. అయితే, ఇందుకు సంబంధించి న్యాయ ప్రక్రియ పూర్తికావల్సి ఉంది.