Hyderabad Student Suicide: చదువు అంటే భయమే ఆ విద్యార్థి ఆత్మహత్యకు కారణమైంది. ఇష్టం లేని కోర్సులో అటు చదవలేక.. దీనిపై ఎవరికీ చెప్పుకోలేక చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శాపూర్ నగర్‌లో నివాసం ఉండే రమేష్ కుమార్ తన కుమారుడు సుమిత్ కుమార్‌ను చింతల్ లోని భాగ్యరది జూనియర్ కళాశాలలో గత సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాడు. అయితే సుమిత్ కుమార్ కు ఎంపీసీ కోర్సు చదవడం ఏమాత్రం ఇష్టంలేదు. పలుసార్లు సుమిత్ తండ్రి, అక్క, కాలేజ్ సిబ్బందితో సుమిత్‌కుమార్‌కు కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో గతవారం సుమిత్‌ను అదే కళాశాలలో ఎంపీసీ గ్రూప్ నుంచి సీఈసీ గ్రూప్‌లోకి బదిలిచేశారు. అయినా చదువు అంటే భయం, ఒత్తిడితో సుమిత్ కుమార్ తన నివాసం శాపూర్ నగర్ నుంచి కాలి నడకన బయలు దేరి గాజులరామారాం పరిధిలో ఉన్న చింతల్ చెరువు దగ్గరకు వెళ్లాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చెప్పులను చెరువు బయట విడిచి చెరువులో దూకాడు.
తమ కొడుకు కనపడకపోవడంతో సుమిత్ తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చింతల్ చెరువు దగ్గర చెప్పులు ఉండటంతో.. అవి సుమిత్ కుమార్ వే అని నిర్దారించుకున్నారు. తమ కుమారుడు ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్న తల్లిదండ్రులకు చివరకు కనిపించకుండా పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదువు అంటే తమ కుమారుడికి ఇంత భయం ఉందని ఊహించలేదంటూ రోదిస్తున్నారు. కాగా.. సుమిత్ కుమార్ మృతదేహం కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
Also Read: