మాదకద్రవ్యాలకు(Drugs) యువత బానిసవుతున్నారు. మత్తులో పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ కు బానిసైన యువత, ఇంజనీరింగ్ విద్యార్థులే ఈ దందాకు ప్రమోటర్లుగా మారుతున్నారు. తెలిసీ తెలియని వయసులో డ్రగ్స్‌కు బానిసై.. మరో నలుగురికి డ్రగ్స్ అమ్ముతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులతో పాటు త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశతో గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలతో అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. జల్సాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో అక్రమ మార్గంలో పయనిస్తున్నారు. ఆఖరుకు పోలీసులకు చిక్కి, కటకటాల పాలవుతూ భవిష్యత్ ను అంధకారంలోకి పడేస్తున్నారు. తాజాగా ఒంగోలు(Ongole) రైల్వేస్టేషన్ లో నిషేధిత మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న బీటెక్ విద్యార్థిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. విద్యార్థి నుంచి రూ.రెండు లక్షలు విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని అరెస్టు చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న బీటెక్ విద్యార్థిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. విశాఖపట్నానికి చెందిన విద్యార్థి.. బెంగుళూరు నుంచి విశాఖపట్నంకు నిషేధిత డ్రగ్స్ తీసుకెళ్తుండగా ఎస్‌ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాలో విద్యార్థి నుంచి రూ.2 లక్షలు విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ లో నాలుగు ఎల్‌ఎస్‌డీ స్టిక్కర్లు, 0.97 గ్రాముల ఎంఎండీఏ, 0.41 గ్రాముల ECSTACY ఉన్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి.. చిన్నతనం నుంచే గంజాయికి అలవాటు పడ్డాడు. అనంతరం డ్రగ్స్ సరఫరాదారుడిగా మారాడని వెల్లడించారు. వైజాగ్ నుంచి బెంగుళూరుకు గంజాయిని సరఫరా చేసి, అక్కడి నుంచి నిషేధిత మాదకద్రవ్యాలను వైజాగ్‌కు తీసుకెళుతున్నట్టు విచారణలో తేలిందని పేర్కొన్నారు. విద్యార్థిని అరెస్టు చేశామన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు వెళ్తే ఏం చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచాలని.. తద్వారా మొదటి దశలోనే వారిని దారిలోకి తీసుకురావడం సాధ్యపడుతుందని అధికారులు సూచించారు. ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు, కాలేజీకి వెళ్తున్నారా, వారి ప్రవర్తనను సైతం కాలేజీకి వెళ్లి తెలుసుకుని అబ్జర్వేషన్ చేసే విధంగా తల్లిదండ్రులు భాద్యతగా ఉండాలని కోరుతున్నారు.
Also Read
రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో