Andhra Pradesh: మోసపోయే వాడు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. ఇది ఎన్ని సార్లు చెప్పినా కొందరికి అర్థం కాదు. అందులోనూ ఆన్ లైన్ మోసాల గురించి వింటూనే ఉన్నా మనకు అలా జరగదులే అని ధీమా వ్యక్తం చేస్తుంటారు. తీరా మోసపోయిన తర్వాత లబోదిబోమంటుంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామో అర్థం అయ్యిందనుకుంటా.. ఇలాంటి ఆన్‌లైన్ తరహా మోసం కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడపజిల్లా కేంద్రంగా RCC అనే షాపింగ్ గ్రాబింగ్ ఆన్‌లైన్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. అదేదో లక్ష రెండు లక్షలు కాదు సుమారు 20 కోట్ల రూపాయలు పైగా స్కామ్ జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ మోసపోయిన వారు కూడా దాదాపు 1500 మందికి పైగా ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో RCC అనే ఆన్‌లైన్ షాపింగ్ గ్రాబింగ్ యాప్
ద్వారా కోట్లలో స్కామ్ జరిగింది.
మొదట RCC అనే ఆన్‌లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టాలి. ఇందులో 3000 నుంచి 20 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టి ఆదాయం సంపాదించుకోవచ్చు అని ఆశ చూపిస్తారు. ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి RCC యాప్‌లో షాపింగ్ గ్రాబింగ్ చేస్తే అంత ఎక్కువ కమిషన్ వస్తుందని ఆశ పుట్టిస్తారు. దీంతో ఎక్కువ ఆదాయం కావాలనే ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంలో బాధితులు రిచార్జి చేసుకొన్నారు. అయితే ఇందులో RCC యాప్‌లో కొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టి తర్వాత ఆన్‌లైన్ యాప్‌లో ఉన్న వస్తువులపై క్లిక్ చేస్తే ఆటోమాటిక్‌గా కమిషన్ వస్తుంది. ఇలా ప్రతి రోజు షాపింగ్ గ్రాబింగ్ చేస్తే కమిషన్ రూపంలో మనం రిచార్జి చేసుకున్న అమౌంట్‌కి డబ్బు యాడ్ అవుతూ ఉంటుంది. ఇదే చాలా మంది బాధితులు నమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బులు రిచార్జి చేసుకున్నారు. అంతేకాక పక్కన ఉన్న స్నేహితులకి రిఫర్ చేస్తే కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పడంతో ఇది ఒక 10 నుంచి 1500 మంది భాదితులుగా చైన్ సిస్టమ్‌లా మారిపోయింది.
అయితే కొన్ని రోజుల వరకు బాగానే కమిషన్ వస్తూనే ఉన్నా, సడెన్‌గా కమిషన్ రాకపోవడంతో ఆన్‌లైన్ కాంటాక్ట్ పర్సన్స్ అడగడంతో మధ్యలో కట్టిన డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు కడితే తప్ప మీ కమీషన్లు గానీ, అసలు డబ్బు గానీ ఇవ్వమని చెప్పడంతో బాధితులు కంగుతిన్నారు. మోసపోయామని తెలుసుకుని తమకు న్యాయం చేయమని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ని కలిసి పిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే బాధితులు అంతా డబ్బులు జమ చేయడం, తిరిగి డబ్బులు పడేది అంతా ఆన్‌లైన్ పక్రియ కావడంతో చేసేది ఏమీ లేక బాధితులు లబోదిబోమంటున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్‌ని వివరణ కోరగా.. పిర్యాదు అందిందని, ఈ యాప్‌పై పూర్తిగా తెలుసుకుంటున్నామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
(సేరి సురేష్, రిపోర్టర్, టీవీ9 తెలుగు)
Also read:
YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..