
Rowdy sheeter killed in Rajamahendravaram : పాతకక్షల నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ రౌడీ షీటర్ శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రాజమడ్రీ పట్టణంలోని 1 టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ 16 కుళాయి సెంటర్ వద్ద రౌడీ షీటర్ కుక్కల సతీష్‌కు అదే ప్రాంతానికి చెందిన మరో రౌడీ షీటర్ గంగాధర్‌కు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కుళాయి సెంటర్ వద్ద సతీష్‌పై అర్ధరాత్రి దుండగులు దాడి చేశారని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో అల్లరిమూకలు రెచ్చిపోయి సతీష్‌ను అతి కిరాతకంగా కత్తులతో నరికి.. బండ రాయితో తలపై మోది హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనా స్ధలంలోనే కన్నుమూశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని.. సతీష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.