Plastic Rice: మంచిర్యాల జిల్లాలో మరో కలకలం.. రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు.. ఆగ్రహించిన ప్రజలు..

|

Dec 13, 2020 | 3:54 PM

కల్తీ.. కల్తీ.. కల్తీ.. పాలు కల్తీ, నీళ్లు కల్తీ, వస్తువుల నాణ్యతలో కల్తీ, తినే తిండిలో కల్తీ.. ఆఖరికి తినడానికి వండే బియ్యంలోనూ కల్తీనే. తాజాగా పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు...

Plastic Rice: మంచిర్యాల జిల్లాలో మరో కలకలం.. రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు.. ఆగ్రహించిన ప్రజలు..
Follow us on

Plastic Rice: కల్తీ.. కల్తీ.. కల్తీ.. వస్తువుల నాణ్యతలో కల్తీ.. పాలు కల్తీ.. నీళ్లు కల్తీ.. తినే తిండిలో కల్తీ.. ఆఖరికి తినడానికి వండే బియ్యంలోనూ కల్తీనే. తాజాగా పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు బయటపడటం మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని హజీపూర్ మండలం వేంపల్లి రేషన్ దుకాణంలోని 138 బస్తాల్లో ప్లాస్టిక్‌ బియ్యం ఉన్నట్టు తేలింది. అప్పటికే 100 మందికి పైగా బియ్యం పంపిణీ చేశారు. ఆ బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లిన లబ్దిదారులు.. వంట చేయగా ఎంతకీ ఉడకలేదు. దీంతో ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ జమీర్, ఇతర అధికారులు.. రేషన్ దుకాణం వద్దకు చేరుకున్నారు. ప్రజలు కూడా ఆ దుకాణం వద్దకు చేరుకుని అధికారుల ముందే ప్లాస్టిక్ బియ్యాన్ని కాల్చారు. దీంతో అవి నల్లబడి ఒకదానికొకటి అతుక్కుపోయాయి. ఆ సందర్భంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు.. రేషన్ దుకాణంలోని 138 బస్తాల్లో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే రేషన్ దుకాణాన్ని తాత్కాలికంగా సీజ్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా రేషన్ పంపిణీని నిలిపివేయాలని ఆదేశించారు. బియ్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించామని తహసీల్దార్ జమీర్ తెలిపారు. కల్తీ అయినట్లు రుజువైతే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా, ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వేంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రేషన్ సరుకుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై, రేషన్‌ దుకాణం డీలర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అధికారులపై మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే కల్తీ బియ్యం పంపిణీ అయినట్లు ఆరోపిస్తున్నారు.