
ఈమధ్య కాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. చదువులో తీవ్రమైన ఒత్తిడి కారణంగానో, పరీక్షలు సరిగా రాయలేదనో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతూ ఉంటారు. మరి కొందరు తమకు మార్కులు తక్కువ వచ్చాయని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకుంటారు. అయితే ఆదివారం నాడు తెలంగాణలో మరోసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మన్నటి వరకూ ప్రైవేట్ కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండేవి. తాజాగా నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతని పేరు ప్రవీణ్‌కుమార్ అని చెప్పారు తోటి విద్యార్థులు. హాస్టల్ క్యాంపస్‌లోని నాలుగో అంతస్తులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
నాగర్ కర్నూల్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ ఈ సంవత్సరమే ట్రిపుల్ ఐటీలో చేరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్దమైనట్లు కాలేజి వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు అవుట్ పాస్ కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళే ఇంటికి బయలుదేరి వెళ్లాల్సి ఉండగా ఈలోపే ఇలాంటి చర్యకు పాల్పడటం తమకు షాక్‌కి గురిచేస్తోదన్నారు కళాశాల సిబ్బంది. ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకున్నట్లు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థి మృతి పట్ల వైస్‌ఛాన్సలర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఉంటున్న గదిలో కాకుండా వేరే గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు గుర్తించారు సిబ్బంది. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..