Prakasham Man Dies In Australia: ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్ బాబు (31) గత ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ రాష్ట్రంలో సల్స్ బరీలో ఉంటున్నాడు.
హరీష్ బాబు మేనమామ కూతురును వివాహం చేసుకొని కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల భార్య ప్రసవం కోసం పుట్టినిల్లు అయిన ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు వచ్చింది. ప్రసవం తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉన్నా.. విమాన రాకపోకలు లేకపోవడంతో కొన్ని రోజులు ఇండియాలోనే ఉన్న భార్య తాజాగా విమానాలు ప్రారంభంకావడంతో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న భార్య.. అక్కడి నుంచి భర్త హరీష్ బాబుకు ఫోన్ చేసింది. అయితే హరీష్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆస్ట్రేలియాలో ఉన్న బంధువులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో బంధువులు హరీష్ ఉన్న ఇంటికి వెళ్లి చూసేసరికి హరీష్ మృతి చెంది ఉండడాన్ని గమనించారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఒంటరిగా ఉన్న హరీష్ ఎలా చనిపోయాడన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. దేశం కానీ దేశంలో కుమారుడు మృతిచెందడం పట్ల హరీష్ తల్లిదండ్రులతో పాటు భార్య విలపిస్తోంది. మృతదేహం స్వగ్రామానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Also Read: తాగి బండి నడిపి అడ్డంగా బుక్కైన మందుబాబులు.. శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా?