ప్రశాంతంగా ఉండే గోదావరి తీరం(Godavari River) క్షుద్ర పూజలతో ఉలిక్కిపడుతోంది. పుణ్యస్నానాలు ఆచరించాల్సిన నదీ తీరం వికృత కృత్యాలతో భయానకంగా మారుతోంది. సమాజం శాస్త్రసాంకేతిక రంగాల వైపు వేగంగా దూసుకెళ్తున్నా మూఢ నమ్మకాలు మాత్రం నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్షుద్రపూజల గురించి. ఏవేవో కారణాలతో గ్రామాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో చేతబడులు, చిల్లంగిలు చేస్తున్నారన్న ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లోనూ వీటిని నమ్మడం ఆందోళన కలిగిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో(Kaleshwaram) క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. అమావాస్య సందర్భంగా పూజలు చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ తీరంలో వీ.ఐ.పీ ఘాట్ వద్ద అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి అమవాస్య ఘడియల్లో పుర్రె, ఎముకలతో విచిత్ర పూజలు చేస్తున్నారు.
క్షుద్రపూజలు జరిపిన ప్రాంతంలో నిమ్మకాయలు, నూతన దుస్తులు, పూజా సామగ్రి వదిలివెళ్లారు. ప్రతి అమావాస్య నాడు వివిధ ప్రాంతాలకు చెందిన మాంత్రికులు ఇలాంటి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. భూత ప్రేత, పిశాచాలు, శని తొలగిస్తామని నమ్మించి, కాళేశ్వరంలో పూజలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్షుద్రపూజల నిర్వహణతో గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తుల్లో భయాందోళన మొదలైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి